అంగరంగ వైభవంగా సత్యదేవుని కళ్యాణం

UPDATED 15th MAY 2019 WEDNESDAY 11:00 PM

అన్నవరం: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం అమ్మవారికి మంగళ సూత్రాలు, చుట్లు, నల్లపూసలు, స్వామి వారికి యజ్ఞోపవీతాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకుని వచ్చారు. వధూవరులైన స్వామి వారిని రజత గరుడ వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై, పెండ్లిపెద్దలు సీతారాములవారిని రజత పల్లకిపై రాత్రి ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి కల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. వధూవరులైన స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి  రామాలయం వద్ద అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా దంపతులు, దేవస్థానం తరఫున ఛైర్మన్‌ ఐవీ రోహిత్, ఈవో ఎంవి సురేష్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ వేడుకకు వ్యాఖ్యాతగా సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ రమేష్ బాబు, ఆలయ ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.   

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us