* గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
UPDATED 21st APRIL 2022 THURSDAY 9:00 PM
రాజమహేంద్రవరం: పరిశ్రమల స్థాపనతోనే ప్రగతి సాధ్యపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.2700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రాసిం ఇండస్ట్రీస్ కోర్ ఆల్కలీ (కాస్టిక్ సోడా) పరిశ్రమను ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. ముందుగా ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్లాంట్ను సందర్శించిన అనంతరం సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి స్విచ్ ఆన్ చేసి కంపెనీని లాంఛనంగా ప్రారంభించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ స్వాగత ఉపన్యాసం చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 'గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని దీనిద్వారా ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేయడం జరిగిందన్నారు. ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుందని, అన్ని అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించి ప్రాజెక్టును నెలకొల్పామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి సహకారం మరువలేనిది : కుమార మంగళం బిర్లా
ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పించనున్నామని దీని ద్వారా సుమారు 2,500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రాసిమ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్ సహకారం మరవలేనిదంటూ ఈ సందర్భంగా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.