పర్యావరణ పరిరక్షణతోనే కాలుష్య నివారణ

UPDATED 13th AUGUST 2018 MONDAY 11:30 AM

గండేపల్లి:  పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణతోనే కాలుష్య నివారణ సాధ్యమని ఆదిత్య డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫోరెన్సిక్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ఈ నెల 12,13 తేదీల్లో రెండురోజులు పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిత్య డైరెక్టర్ సుగుణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుగుణారెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఫోరెన్సిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులబారిన ప్రజలు పడుతున్నారని, అలాగే వృక్ష, జంతు జాలం, సముద్ర జీవులకు సైతం ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు  ప్లాస్టిక్ నివారణకు కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలని అన్నారు. యువత, విద్యార్థులు పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 2018లో పర్యావరణ దినోత్సవానికి మన దేశం నాయకత్వం వహించటం గర్వకారణమన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించటంతో పాటు వినియోగించిన ప్లాస్టిక్‌ని పునరుత్పాదన చేయటం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని వివరించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో పేరుకుపోయి వర్షపు నీటిని లోపలికి ఇంకకుండా అడ్డుకుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తూ విద్యార్థులు ప్లకార్డులతో కరపత్రాలను పంచుతూ గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు ఇ. ప్రవీణ్, యన్. గోవర్ధన్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సింగన అరవిందకుమార్, ఫోరెన్సిక్ సైన్స్ కళాశాల విద్యార్ధినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us