UPDATED 1 JULY 2022 FRIDAY 07.37 PM
Vangaveeti Radha : జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వంగవీటి రాధ క్లారిటీ ఇచ్చారు.
”మా ఆఫీస్ పక్కనే జనసేన ఆదివారం సమావేశం పెట్టుకున్నారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడికి వచ్చారు.
పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారు. టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. రాజకీయ పరిణామాలు ఏమీ లేవు. సరదాగా చాలా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నాకు తెలియదు. మీడియా లేనిపోని హడావుడి చేయకండి. టీ తాగడానికి మాత్రమే వచ్చారు. కలిసి తాగాం” అని వంగవీటి రాధ అన్నారు. వంగవీటి రాధాకృష్ణతో భేటీపై అటు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా క్లారిటీ ఇచ్చారు.
”జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను. పక్కనే రాధe ఆఫీసు ఉండటంతో ఇక్కడకి వచ్చాను. రాధాను మర్యాద పూర్వకంగా కలిశాను. మా మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు లేవు. టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాం. కరెంట్ ఎఫైర్స్ కాదు.. కరెంటు ఛార్జీలు గురించి చర్చించాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.