ఒప్పంద ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత

* ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలన 
* రాష్ట్ర పశుసంవర్ధక, మత్స, మార్కెటింగ్ శాఖా మంత్రి మోపిదేవి

UPDATED 11th NOVEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహనరెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స, మార్కెటింగ్ శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. తొలుత సామర్లకోట పిఎసిఎస్ అధ్యక్షుడు దవులూరి దొరబాబు, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ప్రసాద్, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ మట్లపల్లి రమేష్, సభ్యులు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన స్థానిక శ్రీచాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి, బాలా త్రిపురసుందరి అమ్మవారిని మంత్రి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా మొదటిసారిగా స్వామి వారి ఆశీస్సులు కోసం దేవాలయానికి రావడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రెండు నెలల నుంచి నదులకు వరదలు వచ్చి ఇసుకకు తాత్కాలికంగా కొరత ఏర్పడిందని, కొన్ని రోజుల్లో ఈ కొరత పూర్తిస్థాయిలో తొలగి పుష్కలంగా ఇసుక లభ్యమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి నదులు జలకళను సంతరించుకున్నాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను రెండు నెలల్లో ఏడు పర్యాయాలు ఎత్తడం జరిగిందని అన్నారు. సామాన్యునికి తక్కువ ధరకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను గుర్తించి వాటన్నిటిని ప్రక్షాళన చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నాలుగు లక్షల ఉద్యోగాలను ఇప్పటికే నియమించడం జరిగిందని, అలాగే ఒప్పంద ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆయన అన్నారు. అనంతరం దేవస్థానం వేదపండితులచే మంత్రికి ఆశీర్వచనం గావించి స్వామి, అమ్మవార్ల  చిత్రపటాలు, ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, ఫిషరీస్ ఏడి కోటేశ్వరరావు, డిడి వెంకటేశ్వర రావు, పశుసంవర్ధక శాఖ డిడి శంకర్రావు, మార్కెటింగ్ శాఖ ఎడి కిషోర్, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, తహసీల్దార్ జితేంద్ర, పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, అన్నవరం దేవస్థానం ఘనాపాటి శ్రీపాద రాజశేఖరశర్మ, అభిషేక పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, ఆలయ పండితుల కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న, చెరుకూరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us