మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

UPDATED 27th NOVEMBER 2018 TUESDAY 9:00 PM

తొండంగి: మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ యనమల కృష్ణుడు అధ్యక్షతన తొండంగి మండలం దానవాయిపేటలో గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమం, మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళన సభ మంగళవారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి రామకృష్ణుడు హాజరై మాట్లాడారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నామని, అధిక రాయితీపై డీజిల్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి కార్పొరేషన్‌ ద్వారా రూ.1,350 కోట్లు ఖర్చు చేస్తున్నామని, అలాగే కాపులకు కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.1,000 కోట్లు, రూ.60 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్-ప్లాన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అధిక నిధులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. నియోజక వర్గంలో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం రూ. మూడు కోట్ల చెక్కును పసుపు-కుంకుమ పధకం క్రింద ద్వాక్రా మహిళలకు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us