అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021 : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ మూడో పట్టణ నేర విభాగం పోలీసుస్టేషన్‌లో ఏఎస్పీ కరణం కుమార్‌ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టామన్నారు. కొంత కాలంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న పెద్దాపురం మండలం ఉలిమేశ్వరానికి చెందిన యండపల్లి సూరిబాబు(36), బిక్కవోలు మండలం ఊలపల్లికి చెందిన కస్తూరి అప్పన్న(37)లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 16,41,000 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సూరిబాబుపై పెద్దాపురం స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీటు ఉండగా, అతనిపై గతంలో 30 దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు. ఇతనిపై ఇటీవల పిఠాపురం స్టేషన్‌ పరిధిలో 8, కాకినాడ మూడో పట్టణం నేర విభాగం పోలీసు స్టేషన్‌లో ఒకటి మొత్తంగా తొమ్మిది చోరీ కేసులు నమోదైనట్లు చెప్పారు. వీటికి సంబంధించి అతడి నుంచి రూ.ఎనిమిది లక్షల విలువ గల 176 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల విలువ గల 810 గ్రాముల వెండి వస్తువులు, రూ.30 వేల నగదు, రూ.50 వేలు విలువచేసే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు కస్తూరి అప్పన్నపై బిక్కవోలు స్టేషన్‌లో డీసీ షీటు ఉండగా, అతనిపై గతంలో 80 చోరీ కేసులున్నాయన్నారు. అప్పన్నపై ఇటీవల రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, కాకినాడ రెండో పట్టణ నేర పోలీసు స్టేషన్‌కు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించి రూ.6,61,000 విలువ గల 147 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల విలువ చేసే ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిని అరెస్టు చేసిన కాకినాడ నేర విభాగం డీఎస్పీ రాంబాబు, కాకినాడ 1, 2, 3 పట్టణ నేర విభాగ సీఐలు గోవిందరావు, ప్రశాంత్‌కుమార్, అప్పలనాయుడు, సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతిరావు, బాలాజీ, విజయకుమార్, మూర్తి, ఇతర సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారని తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us