ఆశయాల సాధనే నిజమైన నివాళి

UPDATED 14th APRIL 2019 SUNDAY 8:00 PM

సామర్లకోట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలు సాధించటమే నిజమైన నివాళి అని పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక కోదండరామాపురం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ 20వ శతాబ్దం ప్రపంచానికి అందించిన అతికొద్ది మంది మహానుభావుల్లో అంబేద్కర్ ఒకరని కొనియాడారు. అంటరానితనాన్ని స్వయంగా అనుభవించిన ఆయన కులవివక్షపై అసాధారణ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఉన్నత విద్య అభ్యసించారని, తన మేధస్సుతో అనేక పుస్తకాలు రాయటంతోపాటు దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలను చదివి అర్థం చేసుకుంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో చదువుకు ఉన్న విలువను ఆయన గుర్తించారని, ప్రతీ ఒక్కరూ విద్యతోనే అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని గ్రహించాలని కోరారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టా జానకి రామారావు, సరోజ్ వాసు, తుమ్మల ప్రసాద్, పెంకే వెంకటలక్ష్మి, వడ్డాది దుర్గాదేవి, నూతలపాటి సత్తిబాబు, బి. సుబ్రహ్మణ్యం, జగదీష్, మధు, ఎన్. రాజకుమార్, జి. సురేష్, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us