అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: వరద ప్రభావిత జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో మాట్లాడనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్న సీఎం.. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడనున్నారు. భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటిస్తారు. ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పెన్నానదీ పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. అధికారులతో వరద నష్టం, సహాయక చర్యలపై సమీక్షలు చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు బయల్దేరుతారు.10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు.