Updated 31 January 2022 Monday 06:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. లేఖల రూపంలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తాజాగా సీఎం జగన్ కు మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని లేఖలో డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాపమైందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుండా సొంత డబ్బా కొట్టుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు పునాది రాళ్లకే పరిమితం అయ్యాయని సీఎంకు రాసిన లేఖలో తెలిపారు సోము వీర్రాజు.
పేదల ఇంటి కలకు సాకారమెప్పుడు? అని లేఖలో అడిగారు సోము వీర్రాజు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఎప్పుడు జమ చేస్తుందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారాయన. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా విషయంలో ఆలస్యమే పేదల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. అందుకే ప్రభుత్వానికి గుర్తు చేసే ఉద్దేశ్యంతో బహిరంగ లేఖ రాశానని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించాల్సిన లక్ష్యంతో కేంద్రం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం లేదని సోమువీర్రాజు ఆరోపించారు.