Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

UPDATED 27th MARCH 2022 SUNDAY 12:15 AM

◆ నిశ్చితార్థ బృందానికి ప్రమాదం

◆ 10 మంది దుర్మరణం

◆ చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో ఘటన

◆ ప్రమాద సమయంలో బస్సులో 60 మంది

◆ నిశ్చితార్థానికి వెళుతుండగా ప్రమాదం

◆ 40 మందికిపైగా గాయాలు

Chittoor District : శేషాచలం ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుక కోసం అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన బస్సు లోయలో పడిపోయింది. బాధితులంతా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులే! అంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తుండగా... పీలేరు - తిరుపతి మధ్య ఉన్న భాకరాపేట ఘాట్‌ రోడ్డులో... సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు పది మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 40 మందికి గాయాలైనట్లు సమాచారం. వీరిలో పెళ్లికుమారుడు మల్లిశెట్టి వేణు కూడా ఉన్నారు. ఎక్కువ మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలోనే ఈ ఘోరం జరిగింది. రాత్రివేళ... ఘాట్‌ రోడ్డులో వాహన సంచారం తక్కువ కావడంతో సుమారు రెండు గంటలపాటు బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేకపోవడంతో క్షతగాత్రులు చిమ్మచీకట్లో... నిస్సహాయులుగా హాహాకారాలు చేస్తూ గడిపారు.

● ప్రమాదానికి ఇదే కారణమా...

తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు ఘాట్‌రోడ్డులో నడిపే బస్సును నడిపే అనుభవం లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. భాకరాపేట ఘాట్‌రోడ్డులో ఇది అత్యంత ప్రమాదకరమైన మలుపు. ఘాట్‌ రోడ్డు అప్‌ ముగిసి... దిగువకు వెళ్లేటప్పుడు ఒక్కసారిగా ఏటవాలుగా పెద్ద మలుపు ఉంటుంది. వాహనం వేగం పుంజుకోవడం... ఆ మలుపుపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడంతో ఘోరం జరిగింది. అక్కడ ఎలాంటి రక్షణ గోడ కూడా లేదు. దీంతో బస్సు వేగంగా రోడ్డును దాటి.... గాలిలో అలాగే తేలుతూ వంద అడుగుల లోయలోకి పడిపోయింది. బస్సు చక్రాలు, యాక్సిల్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. పెద్ద పెద్ద కొండరాళ్లు కొట్టడంతో బస్సు కింది భాగం మొత్తం నుజ్జుగా మారింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిమ్మచీకటి, క్షతగాత్రులు లోతైన లోయలో ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అతి కష్టంమీద ఒక్కొక్కరిని లోయ నుంచి బయటికి తీసుకొచ్చారు. టార్చిలైట్లు, ఫ్లడ్‌లైట్ల వెలుగులో సహాయ చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయానికి 26 మంది క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు.. సంఘటన స్థలంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సహాయ చర్యలను పర్యవేక్షించారు. పెళ్లి కుమారుడిది ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌. పెళ్లికూతురు కుసుమది పుత్తూరు సమీపంలోని నారాయణవనం. ఆదివారం తిరుపతిలో నిశ్చితార్థ వేడుక జరపాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఘాట్‌ రోడ్డులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us