రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం

UPDATED 5th JUNE 2018 TUESDAY 10:00 PM

అమలాపురం: వినూత్న ఆవిష్కరణకు చిరునామాగా నిలిచేలా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. అనంతరం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చే దార్శినికతతో గతంలో కిమ్స్ తో పాటు పలు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు తన హయాంలో మంజూరు చేసి అనుమతులు తేవడం జరిగిందని, సంపాదించడం గొప్ప విషయం కాదని, దానిని తోటి సమాజం కోసం వెచ్చించిన వారే ప్రజల మదిలో ఆత్మీయంగా చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అత్యుత్తమ వైద్య సేవలను కోనసీమ ప్రాంత ప్రజలకు ఉచితంగా అందిస్తున్న కిమ్స్ అధినేత కె.వి.వి. సత్యన్నారాయణ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లీడర్ షిప్ సామర్థాలను జోడిస్తే అద్భుతాలు సాధించగలమని, ప్రపంచంలో ప్రతీ నలుగురు ఐటి నిపుణుల్లో ఒకరు భారతీయులు కాగా, ప్రతీ నలుగురు భారతీయ ఐటి నిపుణుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ఉండడం మనకు గర్వకారణన్నారు. అలాగే జెఈఈ, నీట్ పరీక్షల్లో మన రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటుతున్నారని, ఐటి రంగంలో మన సామర్థ్యాల అనుకూలతలతో రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీకి ధీటుగా ఇన్నోవేషన్ వ్యాలీగా మలచనున్నామని తెలిపారు.15 ఎంపీబీఎస్ వేగంతో ఫైబర్ గ్రిడ్ విస్తరణతో పాటు 25 వేల ప్రదేశాలలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నామని, సాంకేతికతను విజ్ఞతతో వాడుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. సోలార్, పవన శక్తిని ఒడిసిపట్టడం ద్వారా కేవలం రూ. 2.50 నుంచి మూడు రూపాయలకే విద్యుత్ ఉత్పాదన చేయగలమని, రాష్ట్ర సోలార్, విండ్ పవర్ ఉత్పాదన పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ అధినేత కె.వి.వి. సత్యన్నారాయణ రాజు, ఎమ్మెల్సీ కె. రవికిరణ్ వర్మ, శశికిరణ్ వర్మ, విద్యావేత్త డార్విన్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us