అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి
గాంధీనగర్ (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: ప్రజలు అలసత్వం వహిస్తూ.. నిబంధనలు పాటించకుంటే కొవిడ్ మహమ్మారిని నియంత్రించలేమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వైరస్ రూపు మార్చుకుంటూ మరోసారి విజృంభిస్తున్నందున జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జనవరి 3 నుంచి పిల్లలకు టీకా ప్రారంభమవుతున్నందున 15 నుంచి 18 ఏళ్ల వయసున్న యువకులందరూ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘రూపు మార్చుకొని కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా పంచాయతీ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. కొవిడ్ పరిస్థితులపై వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోన్న కేంద్ర ప్రభుత్వం.. స్థానిక అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే కొవిడ్ నిబంధలను పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మహమ్మారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. అందరూ కలసికట్టుగా పనిచేస్తే కొవిడ్ పోరులో విజయం సాధిస్తామన్నారు. కొవిడ్‌ను నిరోధించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమన్న కేంద్ర హోంశాఖ మంత్రి.. గడువు ముగిసినా రెండోడోసు తీసుకోని వారందరూ వెంటనే తీసుకోవాలని సూచించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న అమిత్‌షా.. కొవిడ్ విజృంభణ వేళ దేశప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.