Annavaram : ఘనంగా సత్యదేవుడి కల్యాణం

UPDATED 13th MAY 2022 FRIDAY 07:00 AM

▪️ అన్నవరంలో అంగరంగ వైభవంగా నిర్వహణ

Annavaram: భువన మోహనరూపుడైన సత్యదేవుడి దివ్య కల్యాణం గురువారం రాత్రి రత్నగిరిపై అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడిన వేళ భక్తులు పరవశించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, సుగందభరిత పుష్ప పరిమళాలతో రత్నగిరి దివ్యక్షేత్రం కల్యాణ శోభను సంతరించుకుంది. కల్యాణోత్సవాలలో భాగంగా ఉదయం అంకురార్పణతో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం నాందీదేవత పఠనం నిర్వహించిన అర్చకస్వాములు ధ్వజారోహణం చేసి గరుడ ద్విభాగం ఎగురవేసి స్వామి కల్యాణానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.

రాత్రి 7 గంటలకు బాజాభజంత్రీలు వేదమంత్రాల నడుమ నవవరుడైన సత్యదేవుడు వెండి గరుడ వాహనంపై, దేవేరి అనంతలక్ష్మి సత్యవతీదేవి వెండి గజవాహనంపై గ్రామోత్సవం జరుపుకుని రాత్రి 9 గంటలకు కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. సర్వశిల్పా కళాశోభితమై వివిధ పరిమళ పుష్పాలతో విద్యుద్దీప అలంకరణతో సర్వాంగసుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై స్వామి,అమ్మవార్లను కొలువుదీర్చి అర్చకస్వాములు కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. కల్యాణవేదికపై నవదంపతులు సత్యదేవుడు దేవేరి అనంతలక్ష్మి సత్యవతీదేవి ఆశీనులు కాగా పక్కనే ఉన్న మరోవేదికపై పెండ్లిపెద్దలైన సీతారాములు ఆశీనులయ్యారు.

ప్రధానార్చకులు కోట శ్రీను, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో వైదిక బృందం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితరపూజలను చేసి కన్యావరుణలు జరిపారు. ఈసందర్భంగా దేవేరి అనంతలక్ష్మి అమ్మవారితో మంగళగౌరీపూజను చేశారు. స్వామి, అమ్మవార్ల వంశవృక్షాన్ని వివరించే ప్రవరను వేదపండితులు పఠించారు. ద్విజత్వాన్ని ప్రసాదించే సువర్ణ యఙ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా స్వామికి అలంకరింపజేశారు. శ్రీచరణుని పాదాలను పవిత్రజలంతో కడిగి పాదప్రక్షాళన కార్యక్రమం జరిపారు.

మదుపర్కప్రాశన జరిపి మదుపర్కాలను స్వామికి ధరింపజేశారు. చతుర్వేద పండితులు దేశ కాలమాన పరిస్థితులు వివరించే మహాసంకల్పాన్ని చెప్పి చూర్ణికమంత్రాలు పఠించారు. సుముహూర్తవేళ భక్తరక్షణలో ఒకరికొకరు బాసటగా ఉండాలంటూ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్లు ఒకరి శిరస్సుపై మరొకరు ఉంచారు. అమ్మవారికి దివ్యతేజస్సు ప్రసాదించే యుగచ్చిద్రాభిషేకం నిర్వహించారు.

భక్తజన గోవిందనామ స్మరణ నడుమ స్వామి,అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. భక్తజన నేత్రానందంగా స్వామి,అమ్మవార్లు ఒకరి తలపై మరొకరు మంచిముత్యాలను తలంబ్రాలుగా వేసుకున్నారు. పట్టుపీతాంబరాలు, విశేష ఆభరణాలతో నుదుట కల్యాణతిలకం బుగ్గనచుక్కతో స్వామి,అమ్మవార్లు దివ్యతేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కల్యాణ అక్షింతలు, ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన బూరె, పులిహోర ప్రసాదాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు అందజేశారు.

వైదిక కార్యక్రమాలను ముత్య సత్యనారాయణ, చామర్తి కన్నబాబు, తదితరులు నిర్వహించగా కార్యక్రమంలో ఈవో త్రినాథరావు, చైర్మన్‌ రోహిత్‌, స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఎస్పీ రవీం ద్రనాథ్‌బాబు, పెద్దాపురం డీఎస్పీ అరి టాకుల శ్రీనివాసరావు, పూర్వపు పాలక మండలి సభ్యులు మట్టే సత్యప్రసాద్‌, కొత్త కొండబాబు, రావిపాటి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us