Visakhapatnam: నమో వెంకటేశా..

UPDATED 17th MARCH 2022 THURSDAY 05:00 AM

◆ 23 నుంచి వెంకటేశ్వరస్వామి దర్శనం

◆ రేపటి నుంచి రుషికొండలో పూజలు

◆ సముద్రానికి అభిముఖంగా రూ.28 కోట్లతో ఆలయ నిర్మాణం

Visakhapatnam: తిరుమల తిరుపతి దేవస్థానం రుషికొండలో సముద్రానికి అభిముఖంగా నిర్మించిన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. ఈ నెల 18న అంకురార్పణతో ఆలయాన్ని ప్రారంభించి ఐదు రోజుల పాటు యజ్ఞయాగాదులు చేసి 23వ తేదీ నుంచి ప్రజలకు అనుమతించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ చేతులమీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం ఆరు నెలల క్రితమే పూర్తయినా ఇప్పటివరకు ఏర్పాట్లు చేయలేదు.

ప్రకృతి రమణీయత.. భక్తిభావం

రుషికొండలో గాయత్రీ కళాశాల పక్కన కొండపై పదెకరాల విస్తీర్ణంలో రూ.28 కోట్ల వ్యయంతో మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. 2019లో టీటీడీ రూ.17 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించి పనులు చేపట్టగా పూర్తయ్యేసరికి వ్యయం మరో రూ.11 కోట్లు పెరిగింది. తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారి పూజాదికాలు నిర్వహిస్తారో అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇందుకోసం టీటీడీ నుంచే పండితులను రప్పించారు. వారి నివాసానికి అవసరమైన క్వార్టర్లు కూడా నిర్మించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌, విగ్రహాల తయారీ వంటివన్నీ టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ స్క్పల్చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ రూపకల్పన చేసింది. ఇక్కడి ఆలయంలో ఏడు అడుగుల ఎత్తున శ్రీవారి విగ్రహం, 40 అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభం పెడుతున్నారు. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉపాలయాలను నిర్మించారు. స్వామికి ఎదురుగా తిరుపతిలాగే ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి పాదాలను సిద్ధం చేస్తున్నారు.

భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టిక్కెట్ల విక్రయ కేంద్రాలు, క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయంతో పాటు విశ్రమించడానికి పెద్ద హాల్‌ను నిర్మించారు. ప్రార్థనల కోసం 150 మంది సరిపడేలా హాల్‌, వివాహాది శుభకార్యాల కోసం కల్యాణ మండపాన్ని చక్కగా తీర్చిదిద్దారు. భక్తుల వాహనాలను పార్కింగ్‌ చేసుకోవడానికి విశాలమైన ప్రాంగణాన్ని కేటాయించారు. ప్రధార రహదారి నుంచి కొండపైకి వెళ్లడానికి 500 మీటర్ల పొడవున ఘాట్‌ రోడ్డు వేశారు. వీఎంఆర్‌డీఏ ద్వారా మొక్కలు, ఉద్యానవనాలను తీర్చిదిద్దారు.

పూజాది కార్యక్రమాలు..

★ 18వ తేదీ రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ

★ 19న యాగశాలవాస్తు, పంచగవ్య్రపాశనం తర్వాత రక్షాబంధనం

★ 20న ఉదయం, సాయంత్రం హోమాలు, యాగాలు

★ 21న జలాదివాసం, విమానకలశ స్థాపన

★ 22న నవకలశ స్నపనం, సర్వ దేవతార్చన హోమం

★ 23న ఉదయం 5.30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రధాన దేవత విగ్రహాల ప్రదక్షిణ, మహా సంప్రోక్షణ

★ 23వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం. కల్యాణోత్సవం, ధ్వజారోహణం. మళ్లీ రాత్రి 7.30 గంటల నుంచి 8.45 గంటల వరకు సర్వదర్శనం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us