Chandrababu : వైసీపీ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 06:00 PM

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు వాపోయారు. 4వేల మందిపై కేసులు పెట్టారని, ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇంచార్జిలను 80 మందిని అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలిపారు. 33 మందిని పొట్టన బెట్టుకున్నారని వాపోయారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

సీఐడీ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన ఎమ్మెల్సీ అశోక్ బాబును చంద్రబాబు ఈ మధ్యాహ్నం పరామర్శించారు. అశోక్ బాబును అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తించారని చంద్రబాబు మండిపడ్డారు. అశోక్ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు.

అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేశారు… ఇలాంటివి మేం చేయించలేకనా? మూడేళ్లకే జగన్ కు అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ‘సమస్యలు వీళ్లే సృష్టించి, వీళ్లే పరిష్కరించినట్టు నటించి అందరితో బలవంతంగా జేజేలు కొట్టించికుంటున్నారు’ అని సినీ పరిశ్రమ సమస్యల గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా విమర్శించారు.

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు ప్రస్తావించారు. వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్ గా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్ గా నియమించారని చంద్రబాబు వెల్లడించారు. జైలర్ వరుణ్ రెడ్డిని కడపకు ఎందుకు‌ పంపించారని నిలదీశారు. కడప జైలర్ గా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు చెప్పారు.

”మొన్న అర్థరాత్రి టెర్రరిస్టును అరెస్టు చేసినట్లు అశోక్ బాబును‌ అరెస్ట్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో చట్ట ప్రకారం పాలన జరగాలి. పోలీసులు కూడా చట్ట ప్రకారమే వ్యవహరించాలి. లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం. ప్రజలకు అండగా నిలబడడం, పోరాటం చెయ్యడం నేరమా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏం నేరం చేశారని ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారు. ప్రభుత్వ వేధింపులతో కోడెలను‌ పొట్టన పెట్టుకున్నారు. అనేకమంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 33మంది టీడీపీ నేతలను దారుణంగా హత్య చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. తప్పుడు రాజకీయాలు చెయ్యాలనుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు చంద్రబాబు.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. గురువారం రాత్రి సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్ పై ఆరోపణలు వచ్చాయి. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు.

అశోక్ బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి.. ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ముగిసిపోయింది.

రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. అశోక్ బాబు తప్పు చేశారని, ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ కొట్టేరని, వేరొకరికి రావాల్సిన ఉద్యోగం ఆయన దక్కించుకున్నారని ఆరోపించారు. అసలు అశోక్ బాబుపై కేసు పెట్టింది వైసీపీ కాదని, సహ ఉద్యోగి అని క్లారిటీ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us