ఉన్నత విలువలతో ప్రజలకు సేవ చేస్తా

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
* గోదావరి జిల్లాలంటే ఎంతో ఇష్టం 
* కాటన్‌ బ్రిడ్జిపై జన సైనికుల కవాతు

UPDATED 15th OCTOBER 2018 MONDAY 10:00 PM

రాజమహేంద్రవరం: అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే తమ పార్టీ ధ్యేయమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై వేలాది మందితో కవాతు నిర్వహించిన అనంతరం కాటన్‌ బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తనకు రాజకీయ అనుభవం ఏముందని సిఎం ప్రశ్నిస్తున్నారని, లోకేష్‌కు రాజకీయ అనుభవం ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుమారులు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారని, కానిస్టేబుల్‌ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నిర్వహించాలని డిమాండ్‌ చేసే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత జగన్‌కూ లేదని విమర్శించారు. కానీ ఆ ధైర్యం జనసేనకే ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలు పెడితే తన సత్తా చూపిస్తానని పవన్‌ చెప్పారు. సైనికులే దేశ రక్షణ కోసం కవాతు చేస్తారనీ, రాష్ట్రంలో దోపిడీ, అవినీతిని ప్రక్షాళన చేయడానికే కవాతు నిర్వహించామనీ చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో తన మూలాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇక్కడ ఎక్కువ రోజులు ప్రజలతో ఉంటున్నానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో 40 రోజులు ఉన్నానని, తూర్పుగోదావరిలో 30 రోజుల కంటే ఎక్కువగా ఉంటానని స్పష్టం చేశారు. జగన్‌ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించక పోయినప్పటికీ, జనసేన ప్రతిపక్షంగా వ్యవహరించిందని చెప్పారు. జగన్‌ను ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రికి లేదని, ముఖ్యమంత్రినీ, జగన్‌నూ ఎదుర్కొనే శక్తి జనసేనకే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల హింసకు, దోపిడీకి, దౌర్జన్యానికి గురవుతున్న యువత నక్సలిజం వైపు మళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడకూడదన్నారు. కౌలుదారులకు అండగా ఉంటామని, భూయజమానులకు నష్టం కలగకుండా కౌలురైతులకు న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం చట్టం చేయిస్తుందన్నారు. ముస్లింలు భారతీయుల్లో భాగమని, బిజెపి, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని ఎవరు కాదన్నా ఒప్పుకోమన్నారు. కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడుతూ బిసిలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌ ఉండాలన్నది తమ ఉద్ధేశ్యమన్నారు. తాను కాపులను దూరం పెట్టడం లేదని, కాపులను నెత్తిన పెట్టుకోనని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్నఈ వ్యవస్థను మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఒక బలమైన వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు స్పష్టం చేశారు. తమ తండ్రి చిన్నప్పటి నుంచే ఉన్నతమైన విలువలు నేర్పించారంటూ అదే రీతిలో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. పాడైపోతున్న ఈ వ్యవస్థను చూసి చలించిపోయానన్నారు. తన వద్ద రూ.కోట్లు లేవంటూ   విలువలతో పనిచేస్తానని స్పష్టం చేశారు. దోపిడీ వ్యవస్థ, అరాచకాలను ఎదుర్కొనే ధైర్యం తనతో పాటు జనసేన పార్టీకి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. తనకు మూడు దఫాల ఎన్నికల అనుభవం ఉందని ఎన్నో అవమానాలు భరించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, ఎం. రాఘవయ్య, కందుల దుర్గేష్‌, శెట్టిబత్తుల రాజబాబు, పంతం నానాజీ, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us