CM Jagan : రూ.709 కోట్లు.. 10.85లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

UPDATED 5th MAY 2022 WEDNESDAY 05:00 PM

Jagananna Vidya Deevena Funds : జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 జనవరి-మార్చి నెల నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విద్యా దీవెన చివరి త్రైమాసికానికి సంబంధించిన రూ.709 కోట్ల మేర ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారాయన. 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేశారు.

గురువారం తిరుపతిలో పర్యటించారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఎస్వీ యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేశారు.విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మధ్యలో ఆపకూడదనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల 994 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

విద్యా దీవెన ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతికి తావులేని రీతిలో పథకాలను అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.(Jagananna Vidya Deevena Funds) ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలపైన, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు జగన్. తాము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని దొంగల ముఠా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే టెన్త్ పరీక్ష పత్రాలను వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తోంది టీడీపీనే అని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.గత ప్రభుత్వం బడులు మూసివేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్లిందని, కానీ తమ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలను పూర్తిగా మార్చివేసిందన్నారు జగన్. గత సర్కారు బకాయిలు పెడితే, తామే చెల్లించామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని వివరించారు.

గతంలో చంద్రబాబు వసతి దీవెన, నాడు-నేడు వంటివి ఎప్పుడైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ”సంక్షేమ పథకాలపై వక్రీకరణలు చేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలు ఎదగకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా అడ్డుకున్నారు. వాల్లు విగ్రహాలను విరిచేస్తే మనం పెట్టించాం. రైతులను కుంగదీస్తే మనం నిలబెడుతున్నాం. ప్రజలకు ఏనాడూ యెల్లో పార్టీ మంచి చేయలేదు. వారికి మద్దతు పలుకుతున్న యెల్లో మీడియా ఏమీ చేయలేదు” అని జగన్ ఫైర్ అయ్యారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రం ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. 709 కోట్ల రూపాయలను 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లల ఖాతాల్లో జమ చేసింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర చదువులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది.

ఇక ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు (రెండు వాయిదాల్లో), పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ.15 వేలు.. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us