UPDATED 25 MARCH 2022 FRIDAY 06:00 AM
◆ పందులు పట్టడానికి వచ్చినవారిపై దాడి
◆ కర్రలతో రెచ్చిపోయిన పెంపకందార్లు
◆ శానిటరీ ఇన్స్పెక్టర్పైనా దౌర్జన్యం
East Godavari : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పందుల పెంపకందారులు బరితెగించారు. పందులు పట్టుకునేందుకు వచ్చిన వారిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా అడ్డువచ్చిన మున్సిపల్ పారిశుధ్య విభాగం సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. ఇటీవల పట్టణంలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని, ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో పందుల పట్టుకునేందుకు కొంతమందిని ఖమ్మం నుంచి పట్టణానికి తీసుకువచ్చారు.
గురువారం ఉదయం శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజు పారిశుధ్య సిబ్బందితో పాటు పందులు పట్టుకునేవారితో కలిసి స్థానిక పద్మనాభ కాలనీకి వెళ్లారు. అక్కడ పందుల పెంపకందార్లతో చర్చించారు. పెంపకందారులు అధికారులతో దురుసుగా వ్యవహరించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేశారు. అడ్డువచ్చిన శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజును పక్కకు నెట్టేశారు.
పందులను పట్టుకోవడానికి వచ్చినవారిపై కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. పైగా పట్టుకున్న పందులను వాహనంలో నుంచి విడిపించుకుని తీసుకువెళ్లిపోయారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజు బాధితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.