UPDATED 11th FEBRUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ (ఆర్‌బిఎఫ్) ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని ఎన్నికల కమిషన్ ముందు రిజిస్త్ర్టేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథశర్మ పేర్కొన్నారు. స్థానిక శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరాలయంలో ఆదివారం ఫ్రంట్ పొలిట్‌బ్యూరో ముతుకుమిల్లి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ డీఎల్వో సాంబశివరావు, తదితరులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తమ పార్టీలో బ్రాహ్మణులే కాకుండా అన్ని కులాలను సమీకరిస్తామన్నారు. ఈనెల ఆరో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బ్రాహ్మణుల డిమాండ్ల కోసం నిర్వహించిన ధర్నావిజయవంతం అయిందని అన్నారు. బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడం, వారి జనాభాకు అనుగుణంగా సీట్ల కేటాయింపు డిమాండ్ చేయడం జరుగుతోందని, ఆర్బీఎఫ్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కులాల వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజకీయాలకు చైతన్య వేదికగా, రాజకీయ, అధికారానికి దిశానిర్దేశం చేసే తూర్పుగోదావరి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ను ఇక నుంచి రాష్ట్రీయ బ్రాహ్మణ బహుజన ఫ్రంట్ గా మార్చడం జరుగుతుందని, అన్ని కులాలవారు సంపూర్ణ మద్దతు ప్రకటించి తమతో కలిసి రావాలన్నారు. జాతీయస్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కులాల వారీగా విభజించి పాలించే పద్దతికి స్వస్తి చెప్పి రాష్ట్రం, దేశంలోని అన్ని కులాలు, మతాలతో రాష్ట్రీయ బ్రాహ్మణ బహుజన ఫ్రంట్ రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవుడు, బాబీ, తదితరులు పాల్గొన్నారు.