కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 29 వేల మందికి ఇళ్ళ స్థలాలు

* రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి  కురసాల కన్నబాబు

UPDATED 23rd DECEMBER 2020 WEDNESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్  నియోజక వర్గంలో సుమారు 29 వేల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ సమీపంలో ఉన్న కృషి భవన్ లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంపై మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత బుధవారం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఇళ్ళ పట్టాల పంపిణీ, 25న జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నారని, ఎలాంటి విపత్కర పరిస్ధితులు ఎదురైనా ముఖ్యమంత్రి  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అన్ని లేఔట్లలో త్రాగునీరు, విద్యుత్, రవాణా, తదితర మౌలిక సదుపాయాలు కల్పించేలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హత గల ప్రతీ ఒక్కరికీ 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితాలు ప్రతీ గ్రామ సచివాలయంలోను ప్రదర్శించడం జరిగిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ ఈనెల 29వ తేదీన ప్రభుత్వం నష్టపరిహారం అందించడం జరుగుతుందని, నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకొనేందుకు రైతులకు ఈనెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. నివర్ తుపాన్ కారణంగా 12 లక్షల ఒక వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇ-క్రాప్ లో నమోదైన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా సంస్ధను ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కరప మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us