UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 06:20 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కొందరు రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అమలు చేయడం చేతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని సీఎం జగన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ దళిత పక్షపాతి అని కొనియాడారు మంత్రి సురేశ్.
”కొంతమంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలచివేసేలా చేస్తోందో? ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయి. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు?” అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు.. పీఆర్సీ ఆందోళనలపైనా స్పందించిన మంత్రి సురేష్.. పీఆర్సీకి సంబంధించి ఒక మెలిక పడింది.. ముఖ్యమంత్రి పై మాకు నమ్మకం ఉంది.. చర్చలకు వెళ్లటంలో తప్పు లేదని మీరు కూడా చెప్పండని సూచించారు.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్.. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ పై స్పందించే సమయంలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతలు ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. కాంగ్రెస్ నేతలు కూడా హైదరాబాద్ గాంధీ భవన్ లో దీక్షలు చేశారు.
కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు మౌన దీక్షలు చేశారు.