UPDATED 5th APRIL 2022 TUESDAY 10:00 AM
Jagjivan Ram Jayanthi : సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత్ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానంటూ తెలిపారు. దళిత హక్కుల పరిరక్షకులు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని సూచించారు.
సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని, దళితులకు విద్య, ఉపాధి, గౌరవం, రక్షణ అనే లక్ష్యంతో తెలుగుదేశం ఎప్పుడూ పనిచేసిందన్నారు. 2.74 లక్షల మంది దళిత యువత ప్రభుత్వ రుణ సదుపాయాంతో వ్యాపారాలు చేసినా, రోడ్లు, మౌలిక సదుపాయాలతో దళిత కాలనీల్లో వెలుగులు నిండినా అధి తెలుగుదేశం హయాంలోనే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దళితులపై దాడిచేసి, వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టే ప్రభుత్వంపై పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు.
బడుగు జాతి బిడ్డల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు దళిత వర్గం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంచేస్తూనే సామాజిక సమానత్వంకోసం కృషిచేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
దళితుల హక్కుల అమలులో కీలక పాత్ర పోషించడంతో పాటు వారు విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని పరితపించారని కొనియాడారు. తాను అదిరోహించిన ప్రతి పదవితో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మార్గదర్శి జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆదర్శాలతో మనమంతా ముందుకు సాగుదామని లోకేశ్ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.