హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసి టీకాలు వేస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం పెద్దలకు వ్యాక్సిన్ ఇస్తున్న కేంద్రాల్లోనే పిల్లలకూ టీకాలు వేస్తున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తొలి డోస్ తీసుకున్న టీనేజర్లకు నాలుగు వారాల తర్వాత రెండో డోస్ వేయనున్నారు. మరోవైపు 60 ఏళ్ల వయసు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మూడో డోసు ఇచ్చేందుకూ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 10 నుంచి ఆ వయసు వారికి బూస్టర్ డోస్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు.