UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 08:10 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో ఉద్యోగుల నిరసన విప్లవ రూపంలా కనిపించిందని అన్నారు జీవీఎల్ నరసింహరావు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారాయన.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నిరసన చేశాయని, బీజేపీ కూడా ఉద్యోగులకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్య భావనతో, ఉద్యోగుల నిరసనను అవమానించే రీతిలో మాట్లాడిందని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల ఆవేదన, నిరసనను ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని, ఉద్యోగుల ఆవేదన దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు జీవీఎల్. ఉద్యోగుల జీతాలు తగ్గించడం దేశంలో ఎక్కడా చూడలేదని, ప్రభుత్వం అనవసరపు ఖర్చులు ఆపదు కానీ, ఉద్యోగులు త్యాగం చేయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు చూడాలో అన్న ఆందోళన ప్రజల్లో ఉందని అన్నారు.
పార్లమెంట్ దృష్టికి ఏపీ ఉద్యోగుల ఆందోళనను తీసుకెళ్తానని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాల్ ఉద్యోగుల సమస్యేనని అన్నారు. ప్రభుత్వం చర్యలు తిసుకోక పోతే సమ్మె ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారని, వెంటనే తగుచర్యలు తీసుకోవాలని కోరారు.