నవరత్నాలతో ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతా..

* తోట వాణి, వంగా గీతలను గెలిపించాలి
* పెద్దాపురం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

UPDATED 1st APRIL 2019 MONDAY 6:00 PM

పెద్దాపురం: నవరత్నాలతో ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సార్వత్రిక  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నవరత్నాలతో ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని, భరోసా ఇచ్చారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న తోట వాణి‌‌, కాకినాడ లోక్‌సభ అభ్యర్థిని వంగా గీతలను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశానని ఆ పాదయాత్ర ఇదే పెద్దాపురం పట్టణం మీదుగా కూడా కొనసాగిందని అన్నారు. గిట్టుబాటు ధరలు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతన్నలను ఆ పాదయాత్రలో చూశానన్నారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరిగెత్తాయని, నేడు చంద్రబాబు పాలనలో ఆ  ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతూ ప్రాజెక్ట్‌లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అయినా బాధితులకు ఇచ్చింది లేదన్నారు. మీ ప్రతీ బాధ, ప్రతీ  కష్టం విన్నానని, స్వయంగా చూశానని మీ అందరికి నేనున్నానని అన్నారు. రాష్ట్రంలో సుమారు ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసారని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదని అన్నారు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ తో సహా అన్ని ఛార్జీలు పెంచి అన్నీ ప్రయివేట్‌ పరం చేస్తారని అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు కుదించారని, ఇప్పుడిస్తున్న పెన్షన్లను కూడా మళ్లీ అధికారంలోకి రాగానే తగ్గించేస్తారని పేర్కొన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరిట చంద్రబాబు మాఫియాను ఏర్పాటు చేశారని, ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే అని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఒటేస్తే మీరు ఏ సినిమా, టీవీ చానెల్‌ చూడాలన్నా, ఏ పేపర్‌ చదవాలన్నా ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో, ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయని అన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్ధానాలు పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తారని, చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దని చివరి మూడు నెలలు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు నమ్మవద్దని కోరుతున్నానని అన్నారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదని, కుట్రలతో ఈ ఎన్నికలు ఎలాగైనా గెలవాలని  చూస్తున్నారని అన్నారు. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని, జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండని ప్రజలకు సూచించారు. రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

 


    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us