పైసలిస్తేనే పని జరిగేది..

* అవినీతికి అడ్డాగా పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం
* ప్రతీ పనికి ఓరేటు ఫిక్స్
* మట్టి, గ్రావెల్ మాఫియాతో కుమ్మక్కు
* ముడుపులు ఇవ్వకపోతే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే
* జనన, మరణ ధృవపత్రాల జారీలోనూ భారీ వసూళ్లు
* కార్యాలయంలో మీడియేటర్లదే హావా
* కార్యాలయంలో చక్రం తిప్పుతున్న కొంతమంది వీఆర్వోలు
* కాసులు కురిపిస్తున్న భూముల ఆన్ లైన్ వ్యవహారం
* ఉద్దేశ్యపూర్వకంగా ఫైళ్లకు కొర్రీలు

UPDATED 15th SEPTEMBER 2021 WEDNESDAY 2:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డూ అదుపు ఉండడం లేదని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ అత్యధిక మంది ఉద్యోగులు తమ తీరు మార్చుకోవడం లేదు. ప్రతీ పనికి ఓరేటు ఫిక్స్ చేసి ధరఖాస్తుదారుల నుంచి మామూళ్లు ముక్కుపిండి మరీ దండుకుంటున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా క్రింది నుంచి పైవరకూ ఎవరి స్థాయిలో వారు అందినంత దోచుకుంటున్నారు. గతంలో పలుమార్లు బాధితుల నుంచి ఫిర్యాదుల ఆందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ వారి తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా కార్యాలయంలో కొంతమంది వీఆర్వోలే ఏజంట్లుగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తహసీల్దార్ సైతం పొజిషన్ సర్టిఫికెట్ మంజూరుకు రూ.25 వేలు డిమాండ్ చేసినట్లు ఆర్డీవో కార్యాలయానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో వీళ్ళ దందా ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. 
ప్రతీ పనికి ఓరేటు ఫిక్స్...
తహసీల్దార్ కార్యాలయంలో ప్రతీ పనికి ఓరేట్ ఫిక్స్ చేసేశారు. కార్యాలయంలో ఏ పని జరగాలన్నా వారు అడిగింది ముట్టచెప్పాలి లేదంటే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. రైతుభరోసా పథకం క్రింద నగదు సాయం, బ్యాంకుల నుంచి పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందాలంటే పట్టాదారు పాసు పుస్తకంతో పాటు, ఆయా భూముల వివరాలు ఖచ్చితంగా ఆన్ లైన్ లో నమోదై ఉండాలి. వారసత్వంగా వచ్చిన భూములు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం జరిగిన భూములు వారి వారి పేర్లు మీద ఆన్ లైన్ చేయడం, మ్యూటేషన్ తదితర పనులకు ఎకరానికి కనిష్ఠంగా రూ. ఐదు వేలు, గరిష్ఠంగా రూ. 25 వేల వరకూ భూయజమాని అవసరం, స్తోమత బట్టి మామూళ్ల స్థాయి ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. కార్యాలయం చుట్టూ తిరగలేక తమ పని తొందరగా పూర్తి కావాలని చేసేదిలేక వారు అడిగింది ముట్టచెబుతున్నట్లు పలువురు వాపోతున్నారు. పైగా మామూళ్లు ఇవ్వని వారి దరఖాస్తులను నెలల తరబడి కార్యాలయంలోనే మూలుగుతూ ఉంటాయి. ఇక కుల, ఆదాయ ధృవ పత్రాలు, సంక్షేమ పథకాల ధరఖాస్తులకు నిర్ణీత రేట్లు ఫిక్స్ చేసి వసూళ్లు చేస్తున్నారంటే కార్యాలయంలో అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఇళ్ళ పట్టాల మంజూరులో అవినీతి...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం రెవెన్యూ అధికారులకు కాసులు కురిపించింది. ఇళ్ళ పట్టాల పంపిణీలో సైతం భారీ అవినీతికి పాల్పడినట్టు సమాచారం. ముఖ్యంగా మండల పరిధిలోని జి.రాగంపేట గ్రామానికి సంబంధించిన ఇళ్ళ పట్టాల మంజూరుకు ఇద్దరు రెవెన్యూ అధికారులు కొంతమంది అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి వారి సహకారంతో ఇళ్ళ పట్టాల జారీకి ఒక్కోదానికి రూ. 20 వేలు వంతున దండుకున్నట్లు సమాచారం.
కార్యాలయంలో మీడియేటర్లదే హవా...
తహసీల్దార్ కార్యాలయంలో మీడియేటర్ల హావా ఎక్కువగా ఉంటోంది. పట్టణానికి చెందిన ఓ మీసేవా నిర్వాహకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనన, మరణ ధృవపత్రాలు, పోజిషన్ సర్టిఫికెట్లు జారీకి సంబంధించి రూ. 10 వేల నుంచి 25 వేలు వంతున వసూళ్లు చేస్తూ పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు అతనిని ఆశ్రయించి వేలకు వేలు సమర్పించుకుని తమ పనులు కార్యాలయంలో చేయించుకున్నట్లు వాపోయారు. పైగా కార్యాలయంలో పనులను ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, ఏదో ఒక సాంకేతిక కారణం చూపిస్తూ ధరఖాస్తులకు కొర్రీలు వేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.
మట్టి, గ్రావెల్ మాఫియాతో కుమ్మక్కు...
ఇదిలా ఉండగా కొంతమంది  అధికారులు మట్టి, గ్రావెల్ మాఫియాతో కుమ్మక్కు అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెట్ట, ఏటిపట్టు గ్రామాల్లో నిత్యం గ్రావెల్, మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నా ఆవైపు రెవెన్యూ అధికారులు ఎవరూ కన్నెత్తి చూడడంలేదు. పైగా కొంతమంది వీఆర్వోలు ఈ వ్యవహారాలు రహస్యంగా చక్కబెడుతూ వారికి వత్తాసు పలుకుతున్నారని తెలుస్తోంది. పైగా ఎవరైనా పైస్థాయి అధికారులు తనిఖీలకు వస్తుంటే ముందుగానే వారికి సమాచారం చేరవేస్తున్నారు. ఇటీవల రాయభూపాలపట్నం, చినబ్రహ్మదేవం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సంబంధించి పట్టుబడ్డ ట్రాక్టర్లు, జేసీబీలను వదిలిపెట్టేందుకు ఓ రెవెన్యూ అధికారి రూ. లక్ష డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం అధికార పార్టీకి చెందిన ఓ చోట నాయకుడి ద్వారా జరిగినట్లు తెలిసింది
.
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి...
అవినీతికి పాల్పడే  అధికారులపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారుల తీరుకారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.
గుణ్ణం లక్ష్మణరావు
చైర్మన్
ఫర్ ది పీపుల్స్ ఫౌండేషన్
పెద్దాపురం.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us