National Fire Services Day : అగ్నిమాపక సిబ్బంది సేవలు చిరస్మరణీయం

★ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా

UPDATED 14th APRIL 2022 THURSDAY 7:00 PM

National Fire Services Day : కాకినాడ (రెడ్ బీ న్యూస్): అగ్నిప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరక్కుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న అగ్ని మాపక సిబ్బంది సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు.  కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో జిల్లా విపత్తుల స్పందన, అగ్నిమాపక అధికారి కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన అగ్నిమాపక దినోత్సవం, అగ్నిమాపక వారోత్సవాల (ఏప్రిల్ 14-20) ప్రారంభ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన ఇద్దరు ఫైర్ ఫైటర్లకు ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ ఘన నివాళులు అర్పించిన అనంతరం అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అగ్ని భద్రత నేర్చుకోండి.. ఉత్పాదకతను పెంచుకోండి.. ఇతివృత్తంతో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల అగ్నిమాపక పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల సమయంలో మంటలను ఆర్పే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కృతజ్ఞతా పూర్వకంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు. కేవలం అగ్ని ప్రమాదాలే కాకుండా తుపాన్లు, వరదలు వంటి విపత్తుల సమయంలోనూ అగ్నిమాపక దళాలు విశేష సేవలు అందిస్తున్నాయని అన్నారు. గత సంవత్సరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది 1,049 ఫైర్ కాల్స్, 89 రెస్క్యూ కాల్స్ స్వీకరించారని, అలాగే సుమారు రూ. 64 కోట్ల విలువైన ఆస్తి కాపాడారని అన్నారు.  కాకినాడ జిల్లా పరిధిలో ఏడు ఫైర్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది మొత్తం 107 మంది అందిస్తున్న సేవలను అభినందించారు.

అగ్నిమాపక కేంద్రాల్లో మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్తులో మౌలిక వసతుల పరంగా ఇంకా ఏమైనా అవసరమైతే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో విపత్తు స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

చిన్న అజాగ్రత్తల వల్లే  తరచు అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వేసవి కాలంలోనే జరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అగ్ని ప్రమాదాలు, విపత్తులపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నామని, సినిమా థియేటర్లు, కమ్యూనిటీ హాళ్లు, వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లు తదితరాల్లో అగ్ని ప్రమాదాలు జరక్కుండా నిబంధనల మేరకు ప్రమాద నివారణ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్  సూచించారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో బి. వెంకటరమణ, కాకినాడ జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్. సురేంద్ర ఆనంద్, ఏడిఎఫ్ఓ బి. ఏసుబాబు, తదితరులు హాజరయ్యారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us