Updated 26 January 2022 Wednesday 09:50 PM
గన్నవరం (రెడ్ బీ న్యూస్): మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా..అకృత్యాలు ఆగడం లేదు. మృగాళ్లపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. 14 ఏళ్ల బాలికను యువకుడు కిడ్నాప్ చేసి ఆపై చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం గన్నవరం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పద్నాలుగు సంవత్సరాల బాలికను ఓ యువకుడు ఆదివారం సాయంత్రం కిడ్నాప్ చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఏలూరు, కాకినాడ, రాజమండ్రిలో గాలించారు. బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కిడ్నాప్ చేసిన బాలికను యువకుడు గన్నవరం పోలీస్ స్టేషన్ కు సమీపంలో గల ఒక గదిలో బంధించాడు. బాలికను యువకుడు చిత్రహింసలకు గురిచేశాడు. యువకుడిపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు గదిలో బందీగా ఉన్న బాలికను రక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుడిపై ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.