UPDATED 12th JANUARY 2018 FRIDAY 9:00 PM
రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం టౌన్‌హాలులో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడలో ఇటీవల బహుమతి సాధించిన ఆచంట ఉమేష్‌కుమార్ అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో క్రీడలకు 30 ఎకరాల భూసేకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులిచ్చారని, త్వరలో భూసేకరణ చేసి అన్ని సౌకర్యాలతో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో క్రీడాసక్తిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మ్లెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు అన్నిరకాల క్రీడల్లోనూ ప్రతిభచూపటం స్వాగతించవలసిన విషయమన్నారు. గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ టౌన్‌హాలు టీటీ క్రీడకు దేవాలయం వంటిదని, ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించటం ఆనందంగా ఉందన్నారు. టౌన్‌హాలు ఎదురుగా ఉన్న స్థలంలో ప్రస్తుతం క్రీడాకారులు సాధన చేస్తున్నారని, ఆ స్థలాన్ని టీటీ అసోసియేషన్‌ను అందించాలని చినరాజప్పను కోరారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ క్రీడాకారులు ఉమేష్‌ను ఆదర్శంగా తీసుకుని రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, దొండపాటి సత్యంబాబు, ఆకుల వీర్రాజు, ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు, తపాలా శాఖ అధికారులు, టీటీ కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.