Sajjala: వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జిషీట్‌లో కుట్ర ఉంది-సజ్జల సంచలనం

UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 09:30 PM

అమరావతి: ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వాళ్లని కాకుండా.. జరిగిందని తెలిసి వెళ్లిన ఫ్యామిలీ మెంబర్స్ పై సీబీఐ ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. సీబీఐ ఛార్జిషీట్ లో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరుగుతోందన్నారు. సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్‌ చేస్తామన్న ఆయన ఈ హత్య కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

”నేను ప్రభుత్వ సలహాదారుగా కాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జిషీటు పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్‌ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉందని, చార్జ్‌షీట్‌లో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతోందన్నారు. వివేకాను.. కుటుంబ సభ్యులే హత్య చేశారని దుష్ప్రచారం చెయ్యడం దారుణమైన చర్య. నాడు వివేకా హత్యకు ఎంత కుట్ర చేశారో.. నేడు ఆ కుటుంబంపై అంతకంటే ఎక్కువ కుట్ర జరుగుతోంది. సీబీఐ లాంటి ఏజెన్సీ కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు పెట్టింది..? ఛార్జిషీట్ చూస్తే షాక్ కి గురి చేసింది.

సంబంధం లేని వ్యక్తులను ఛార్జిషీటులో చేర్చడం దురదృష్టకరం. అసలు సంబంధం లేని యంగ్ ఎంపీపై ఇలాంటి ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణం. దీనిపై ఏ విధంగా సవాల్ చెయ్యాలో ఆ విధంగా చేస్తాం. జగన్ కుటుంబంలో చీలికలు తెచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీబీఐ తీరు చంద్రబాబు అండ్ కో లక్ష్యంకి దగ్గరగా ఉంది. ఇది సీబీఐ పైఅధికారులకు తెలిసే జరుగుతుందా? చంద్రబాబు అండ్ కో పెద్ద పెద్ద వ్యవస్థలని కూడా మ్యానేజ్ చేస్తున్నాయి. సీబీఐ ఛార్జిషీట్ పూర్తిగా అపార్ధం.. ప్రజలకు తెలియజేస్తాం” అని సజ్జల అన్నారు. వైఎస్ఆర్ ని ఎంత అభిమానిస్తామో.. వివేకాను కూడా అంతగా అభిమానిస్తాం అని సజ్జల అన్నారు.

2019 ఎన్నికల ముందు వివేకా హత్య మమ్మల్ని కుదిపేసిందన్నారు. జగన్ ని వ్యక్తిగతంగా కుంగదీసిందన్నారు. వివేకా చనిపోవడం వైసీపీకి, జగన్ కుటుంబానికి తీవ్ర నష్టం అని చెప్పారు. జగన్ సీఎం అవ్వడానికి, అవినాష్ రెడ్డి విజయానికి వివేకా ఎంతో కష్టపడి పని చేశారని తెలిపారు. హత్యకు ముందు రోజు కూడా అదే పనిలో ఉన్నారని అన్నారు. జగన్ కి భారం తగ్గించి జిల్లా అంతా ఆయనే తిరిగారని వెల్లడించారు. ఎంపీ టికెట్‌ కోసం వివేకా హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్‌లో కథనం రాయడం పూర్తి అసంబద్ధం అన్నారు.

వైసీపీని, ఎంపీ అవినాష్‌ను అప్రతిష్ట పాల్జేసే కుట్ర జరుగుతోందన్నారు.ఇక కడప జైలర్ వరుణారెడ్డి బదిలీ అయితే కూడా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని సజ్జల వాపోయారు. అప్పట్లో ఆ జైలర్ తప్పు చేసి ఉంటే 2014 నుండి 19 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు.. వరుణారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు సజ్జల.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us