Yadadri: తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. యాదాద్రి

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 09:00 PM

యాదాద్రి: తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమవుతోంది. నల్లరాతి శిలల నుంచి జీవం పోసుకున్న అద్భుత కళాఖండాలు, ఆధ్యాత్మికతను-ఆహ్లాదాన్ని పంచే ముఖమంటపం, బాలపాద స్తంభాలు, దానిపై గజరాజులు-సింహాలు, గోడలపై లతలు, పద్మాలు.. ఒకదాన్ని మరొకటి మించినట్లున్న కళాఖండాలు.. ఇలా ఒక్కో శిల్పం.. ఒక్కో అద్భుతం.. యాదగిరీశుడి సన్నిధిలో కొలువుదీరుతున్న శిల్పకళా సౌందర్యమిదీ. ఇప్పటికే ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యాయి. మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. చుట్టూ పచ్చదనం, కళా నైపుణ్యం, ఆధ్యాత్మిక వైభవంతో అపర వైకుంఠాన్ని తలపిస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభం కోసం భక్తకోటి వేయి కన్నులతో ఎదురుచూస్తోంది.

మూలవర్యుల దర్శనభాగ్యం కల్పించే శుభఘడియలు సమీపిస్తున్నాయి. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామిజీ సూచనలతో.. మార్చి 28న యాదాద్రి పునర్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 8 రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగం జరుగుతుంది. అలాగే చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలో మహా సుదర్శన యాగం ఉంటుంది. యాదాద్రిలో 10వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.

ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. భక్తులకు కనువిందు గొలిపేలా యాదాద్రీశుడి ఆలయాన్ని ప్రపంచస్థాయి క్షేత్రంగా శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీవైష్ణవ ఆచార్యులైన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్తపతులు కార్యరూపంలోకి తీసుకొచ్చారు. పాంచరాత్ర ఆగమ, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగాయి. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్‌ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి.

తొలిసారిగా ఆధారశిల నుంచి గోపురం పైవరకూ పూర్తిగా యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మించారు. కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. అద్భుతహా అనిపించేలా సప్త గోపురాలు.. ధార్మిక సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ప్రాకారాలు.. బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ముఖ మండపం.. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కృష్ణ శిలా సౌదర్యం.. ఒక్కటేమిటి.. ఆద్యంతం భక్తి పారవశ్యంలో ఓలలాడించే కట్టడాలతో యాదాద్రి నారసింహుడి క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.

ప్రతి నిర్మాణంలోనూ ఓ విశిష్టత ఉట్టిపడేలా పనులను చేపట్టారు. గర్భాలయంలో 12 ఆళ్వార్ పిల్లర్లు, 12 కాకతీయ పిల్లర్లను ఏక శిలతో నిర్మాణాలు.. ప్రాకార మండపంలో భారత దేశ చరిత్ర, శ్రీ మహవిష్ణువు అవతారాలు, తెలంగాణా చరిత్ర, క్రీడలు-సంస్కృతి చిహ్నాలు శిలలపై అద్భుతంగా చెక్కారు. ఆలయం పసిడి కాంతిని వెదజల్లేలా బెంగుళూరుకు చెందిన నిపుణులతో లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా నభూతో న భవిష్యత్ అన్నట్లుగా యాదాద్రి సిద్ధమైంది.

యాదాద్రి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న గర్భాలయం ముందున్న ముఖమండపం ఏర్పాటు చేశారు. చుట్టూ గోపురాలు, ప్రాకారాల నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ముఖమండపం, ప్రధాన రాజగోపురం సహా.. సప్త గోపురాల నిర్మాణాలను కృష్ణశిలతో తీర్చిదద్దారు. ప్రధాన ముఖద్వారంతోపాటు మిగతా అన్ని ద్వారాల ముందు మహాబలిపురం నుంచి తెచ్చిన ఏనుగులు అందరినీ కట్టిపడేస్తున్నాయి.

ఆలయ ప్రారంభోత్సవం తర్వాత దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు యాదాద్రిని సందర్శించనుండడంతో ఏ ఒక్కరికీ ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అన్ని సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. యాదాద్రి కొండపైన లిఫ్ట్‌ నిర్మాణంతోపాటు.. ఈఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి ప్రముఖులు బసచేసేందుకు ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై 143 కోట్ల వ్యయంతో ప్రెసిడెన్షియల్‌ సూట్లు నిర్మించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us