అమలాపురం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల అమలాపురం గ్రామీణం, న్యూస్టుడే: కష్టాల్లో ఉన్న ప్రజలను ముఖ్యమంత్రి జగన్ అంధకారంలోకి నెట్టారని, ప్రస్తుతం చీకటిరాజ్యం నడుస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అమలాపురం మండలం ఇందుపల్లిలో నియోజకవర్గ బాధ్యుడు శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సరైన తీరులో వ్యవహరించడం లేదని, కడపలో వరదలతో ప్రజలు నష్టపోతే సీఎం హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వేచేసి వెళ్లిపోవడంపై ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని, వారికి జనసేన అండగా నిలుస్తుందన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాలో రూ.230కోట్లు వెనక్కి వెళ్లాయని, ఇలా అయితే సర్పంచుల పరిధిలో సమస్యలు పరిష్కారమెలా అవుతాయని ప్రశ్నించారు. ఓటీఎస్ విధానం ద్వారా రూ.10 వేలు వసూలు చేయడంపై మనోహర్ మండిపడ్డారు. వైకాపా నాయకులను చూస్తేనే ప్రజలు భయపడుతున్నారని, కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబరు 31లోపు అన్ని పట్టణాలు, గ్రామాల్లో జనసేన పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ యాళ్ల నాగసతీష్ను జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.