అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 నవంబర్ 2021:: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మరోవైపు సీఎం జగన్ కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సుమారు రెండేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్చేస్తూ అమరావతి రైతులతో సహా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. రాజధాని కేసులపై హైకోర్టు తాజాగా రోజువారీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.