Statue Of Equality : ముగిసిన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు..

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 07;50 PM

ముచ్చింతల్: ముచ్చింతల్‌లోని శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వేడుకల్లో చివరి రోజైన 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మహాయాగాన్ని ముగించారు. శ్రీభగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది.

ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహాపూర్ణాహుతితో 12 రోజుల యజ్ఞం విజయవంతమైంది. మహాపూర్ణాహుతి తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి స్ఫూర్తికేంద్రం వరకు పెరుమాళ్‌ యాత్రను నిర్వహించారు. 120 కిలోల శ్రీభగవద్రామానుజాచార్యుల సువర్ణమూర్తికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి విశేష అభిషేకాన్ని చేశారు. అనంతరం రామానుజాచార్యుల ప్రత్యేక ఆరాధన, దర్శనం జీయర్ స్వాముల ప్రత్యేక ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. సువర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మై హోం గ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం ఈ మహోత్సవంలో పాల్గొన్న పండితులు, రుత్విజులను చిన్న జీయర్ స్వామి సన్మానించారు. ఈ సందర్భంగా.. సాయంత్రం నిర్వహించాల్సిన 108 దివ్య దేశాల కల్యాణోత్సవం వాయిదా వేశారు. వేలాది మంది ఉన్న రుత్విజులను..ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండడంతో కళ్యాణాన్ని వాయిదా వేయడం జరిగిందని చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారం మంచి ముహూర్తం ఉందని..ఈ రోజున వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి వైభవానికి అందరూ కారణమయ్యారన్నారు. చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని ఆరంభం చేసిన అదృష్టానికి భాగస్వాములు అయినందుకు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంతో మంది ఈ మహోత్సవంలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమ విధానాన్ని నేర్చుకుని, వైదిక సంప్రదాయంలో పుట్టినందుకు ఓ చక్కటి అవకాశం వస్తోందన్న ఆనందంతో ఇక్కడకు వచ్చారన్నారు. సంకల్పం ప్రారంభించినప్పటి నుంచి సమతామూర్తి సేవలో మేము కూడా ఉంటామని సంపదను రామానుజ మూర్తి నిర్మాణంలో ఉపయోగించి… చాలా మంది కారణమయ్యారని..వీరికి అనేక మంగళాశాసనమలు చేస్తున్నామన్నారు చిన్న జీయర్ స్వామి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us