గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

UPDATED 9th AUGUST 2018 THURSDAY 8:00 PM

రంపచోడవరం: ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రాచీన చరిత్రకు నిలువుటద్దమని, ఆదివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను ప్రగతిబాట పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు మూలంగా మలేరియా తగ్గుముఖం పట్టిందని, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 2500లు ఫించన్ రూపంలో అందించడం జరుగుతోందని, మారుమూల గిరిజన రోగులు తరలింపుకు ఫీడరు అంబులెన్సుల వ్యవస్థను అమలులోనికి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఆధునీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో పర్యాటరంగ అభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధిని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ను పోలీసు శాఖలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ అభివృద్ధి సంక్షేమం పట్ల చైతన్యం పెంపొందించడానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని, గిరిజనులు జీవితాలలో వెలుగులు నింపి అభివృద్ధి దిశలో పయనించేలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆదివాసీల సాంప్రదాయ సంస్కృతిని పరిరక్షిస్తూ వారి కుల వృత్తులును ప్రోత్సాహిస్తూ వ్యవసాయం, ఉద్యాన, స్వయంఉపాధి, ఉద్యోగావకాశాలు తదితర రంగాల్లో ఐటిడిఎ వారి అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్, ఎన్టీఆర్ విద్యోన్నతి పధకాలను గిరిజన యువత అందిపుచ్చుకొని ఆదర్శంగా జీవిస్తూ భావితరాలకు స్పూర్తిగా నిలవాలన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి రూ.1679 కోట్లు కేటాయించిందని, ట్రైకార్ ద్వారా ఇన్నోవా కార్లు రాయితీపై ఇస్తున్నామని అన్నారు. గిరిజనులు పోష్టికాహారం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 లక్షల కుటుంబాలకు ఆహార బుట్టలు పంపిణికీ చర్యలు తీసుకున్నారని త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపంలోనికి రానుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ అటవీ హక్కుల విషయంలో రూపుదిద్దుకున్న అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, ఆదివాసీ గ్రామసభల్లో స్వీయపరిపాలన హక్కులు కల్పించే పీసా చట్టం, భూబదలాయింపు నిషేధ చట్టం (170) వంటివి పక్కాగా అమలు చేస్తూ గిరిజనులకు  ప్రయోజనాలు కల్పించడం జరుగుతోందన్నారు. తొలుత ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. కోటి 20 లక్షలుతో నెలకొల్పిన డయాలసిస్ సెంటర్, జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ. కోటి ఆరు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంను ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సెంటరు నుంచి ర్యాలీ నిర్వహించి జూనియరు కళాశాలలోని వేదిక వద్దకు వచ్చి నాబార్డు నిధులు రూ. కోటీ 78 లక్షలతో పందిరిమామిడి గ్రామంలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం, ఫోక్స్ పేట రిలయన్స్ జియో టెలికం టవరు, అడ్డతీగల, వై.రామవరంలో కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలల్లో స్పెషల్ నియోనేటల్ కేర్ యూనిట్లను వారు ప్రారంభించారు. అనంతరం ఏడు గిరిజన తెగల స్టాల్స్   సందర్శించి, ముఖ్యమంత్రి బాల సంజీవని పథకాన్ని జిల్లాలో ప్రప్రథమంగా వారు ప్రారంభించారు. 20 మందికి ఆర్.వో.ఎఫ్.ఆర్ పట్టాలు 54 ఎకరాలుగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి బాల సురక్ష మోబైల్ టీములను ప్రారంభించి, ఏడు విభాగాలైన ట్రైకార్ వెలుగు, వ్యవసాయం, ఉద్యాన, మత్స్య హౌసింగుల ద్వారా సుమారు రూ. ఎనిమిది కోట్ల రెండు లక్షలు విలువైన ఉపకరణాలు, బాల సంజీవని కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆదివాసీ కులపెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ, స్థానిక శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, ప్రతిపాడు ఎంఎల్ఏ వరుపుల సుబ్బారావు, మాజీ ఎంఎల్ఏలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, కె.కె. విశ్వనాద్, ఐటిడిఎ పివో  డాక్టర్ వి. వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us