విశాఖ ఉక్కు రక్షణకు జనసేన డిజిటల్‌ ఉద్యమం

వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విటర్‌లో ట్యాగ్‌ చేయాలి

పవన్‌కల్యాణ్‌ పిలుపు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021: ‘విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా జనసేన తరఫున డిసెంబరు 18, 19, 20 తేదీల్లో డిజిటల్‌ ఉద్యమం చేపడదాం. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు అన్న నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. వైకాపాకు చెందిన 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలకు బాధ్యత గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్‌ ప్రచారం చేద్దాం. వైకాపాతో పాటు తెదేపా ఎంపీలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణపై మాట్లాడాలి. ప్లకార్డులు ప్రదర్శించాలి. వారికి ఆ బాధ్యత గుర్తు చేసేలా మన రాష్ట్ర రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్టులు పెట్టాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయం పార్లమెంటుకు తెలియజేయాలని మన ఎంపీలను సామాజిక మాధ్యమాల్లో కోరదాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం పిలుపునిచ్చారు. ‘ఎంతో మంది బలిదానాలతో, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. అలాగే ఈ విషయంలో కేంద్రానిదే బాధ్యత అని వదిలేసిన వైకాపా ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లం అవుతాం. మేం మా బాధ్యతగా ప్లకార్డులు ప్రదర్శిస్తాం. కార్మికులకు అండగా ఉంటాం’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us