రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో క్రీడా వికాస భవనాలు

UPDATED 10th APRIL 2018 TUESDAY 5:00 PM

పెద్దాపురం: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎన్.టి.ఆర్ క్రీడా వికాస భవనాలను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర  క్రీడా శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్థానిక శతాబ్ధి పార్క్ వద్ద రూ. రెండు కోట్లతో నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్ క్రీడా వికాస కేంద్రం, అలాగే ఏడిబి రోడ్డు నుంచి తామరాడ వరకు రూ. ఆరు కోట్లుతో రోడ్డు నిర్మాణం, రోడ్డు మరమ్మత్తులకు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప, క్రీడా శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఎన్.టి.ఆర్ క్రీడా వికాస భవనాన్ని నిర్మిస్తున్నామని, అలాగే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు ఎన్.టి.ఆర్ క్రీడా వికాస పథకాన్ని వర్తింపు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎన్.టి.ఆర్ క్రీడా వికాస భవనంలో టెన్నీస్, వాలీబాల్, కబాడీ, బ్యాడ్మింటన్, తదితర క్రీడలను అభ్యసించుకోవచ్చన్నారు. పెద్దాపురం పట్టణానికి చెందిన చినగంథం మహేష్ భూపతి టెన్నిస్ లో అంతర్జాతీయ క్రీడాకారుడుగా గుర్తింపు తెచ్చాడని మంత్రి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కోరిన స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేస్తామని దానికి స్థలం కేటాయించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీలేని పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే రైతులకు రూ. 24 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు రూ. ఆరు  వేలు ఇచ్చామని, త్వరలోనే రూ. నాలుగు వేలు అందచేస్తామని చెప్పారు. అర్హత కలిగిన పేదవారికి పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు అందచేస్తున్నామని, రాజధాని నిర్మాణానికి రూ. 33 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అనుసంధానం వల్ల రాయలసీమ రైతులకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి  చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో బాగంగా పెద్దాపురం పట్టణంలో క్రీడా భవనం నిర్మిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో మంచి క్రీడాకారులున్నారని, ఈ స్టేడియం ద్వారా మరెంతో మంది  క్రీడాకారులు అభివృద్ధిలోకి వస్తారని చెప్పారు. రూ. 40 కోట్లుతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, రూ. ఐదు కోట్లుతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి రూ.7.50 కోట్లుతో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని, వార్డుల్లో సి.సి. రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశామన్నారు. నూతన బస్ కాంప్లెక్స్, రైతుబజారు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర  రెవెన్యూ శాఖా మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి నూతనంగా నిర్మించబోయే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ త్రాగునీటికి తూర్పుగోదావరి జిల్లాకు రూ. 2 వేల 300 కోట్లు జిల్లాకు మంజూరు చేయగా, ఇందులో రూ.1000 కోట్లు రిలీజ్ చేశారని చెప్పారు. పెద్దాపురం కొంత భాగం మెట్టప్రాంతం అవ్వడం వల్ల దీనికి కూడ సాగునీరు రావడానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ఇరిగేషన్ మంత్రిని కోరామని చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో కొత్తగా మంజూరైన వృద్ధాప్య పింఛన్లు మంత్రులు లబ్దిదారులకు అందచేశారు. అనంతరం మంత్రులు శతాబ్ది పార్కును సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, శాప్ ఎండి నల్లపురాజు బంగార్రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, ఆత్మాచైర్మన్ కలకపల్లి రాంబాబు(రాము), ఎంపిపి గుడాల రమేష్, జెడ్.పి.టి.సి సుందరపల్లి  శివనాగరాజు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఎంపిడివో  పి. వసంతమాధవి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us