UPDATED 18th FEBRUARY 2022 FRIDAY 07:00 AM
CM Jagan visit Guntur : ఏపీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూరులోని అక్షయపాత్ర వరకు, అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి వచ్చే మార్గంలోని కొలనుకొండ జాతీయ రహదారి వెంబడి నిర్మించనున్న హరేకృష్ణా ప్రాజెక్టు వరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంచారు. అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజనాన్ని మరిన్ని పాఠశాలలకు సరఫరా చేయటానికి ఆత్మకూరులో అత్యాధునిక కేంద్రీకృత భోజనశాలను నిర్మించింది.
కేవలం రెండు గంటల వ్యవధిలో 50వేల మందికి ఆహారం తయారు చేసే ఏర్పాట్లు భోజనశాలలో ఉన్నాయి. రుచి, శుచే లక్ష్యంగా ఆ సంస్థ పాఠశాల విద్యార్థుల కడుపు నింపుతోంది. ప్రభుత్వం తొలుత తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు భోజనం అందించేలా ఒప్పందం చేసుకుంది. ఇంతకు ముందే అక్కడ ఒక భోజనశాల ఉంది.