UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 02:30 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): ఫిబ్రవరి 4. క్యాన్సర్ డే. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని లక్టికపూల్ లో ఉన్న ఎంఎన్ జే హాస్పిటల్ లో క్యాన్సర్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్ ను ప్రారంభించారు.
అలాగే హాస్పిటల్ లో సిటీ స్కానింగ్, డెంటల్ ఎక్స్‌రే ఓపీజీ, పెషేంట్ అటెండెన్సీ భవనంతో 100 పడకల సత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని అని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు..
7 కోట్ల 16 లక్షలతో అధునాతన సీటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని..క్యాన్సర్ రోగులను గుర్తించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. కోటితో అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ స్ర్కీనింగ్ వాహనాన్ని ప్రారంభించామన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. నీనారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా డాక్టర్ గోవింద్ రావు రూ. 3 కోట్లతో 300 పడకల పేషెంట్ అటెండెన్సీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ రూ. 5 భోజన సౌకర్యం కల్పిస్తాం. రూ. 40 లక్షలతో డెంటల్ ఎక్స్‌రే ఓపీజీని ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. ఈహెచ్ఎస్, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లతో నిర్మించిన 24 గదుల స్పెషల్ బ్లాక్‌ను ప్రారంభించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎన్‌జే క్యాన్సర్ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని హరీశ్‌రావు ఈసందర్భంగా గుర్తు చేశారు. ఎంఎన్‌జే ఆస్పత్రికి 252 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. 32 మంది డాక్టర్లు 85 మంది స్టాఫ్‌నర్సులు, 85 మంది టెక్నిషీయన్లను మంజూరు చేశాం. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో అరబిందో ఫార్మా వారు సీఎస్ఆర్ ప్రోగ్రాం కింద రూ. 65 కోట్లతో 300 పడకలతో కొత్తగా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఇది ఏప్రిల్ నెలలోగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతమున్న 450 బెడ్స్‌కు అదనంగా ఈ 300 బెడ్స్ వస్తే 750 పడకలకు అప్‌గ్రేడ్ చేసుకోబోతామని మంత్రి తెలిపారు.
ఎంఎన్‌జేకు సమీపంలోని రెండు, మూడు ఎకరాల స్థలాన్ని కూడా క్యార్ హాస్పిటల్‌కు అందించాలని కోరారు. ఆ స్థలాన్ని ఎంఎన్‌జే ఆస్పత్రికి కేటాయిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎంఎన్జేలో ప్రస్తుతం 3 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఏడాదికి 4000 మైనర్ సర్జరీలు, 1500 మేజర్ సర్జరీలు చేస్తున్నారు. రూ. 15 కోట్లతో 8 అధునాతన ఆపరేషన్ థియేటర్లను నిర్మించబోతున్నాం. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి నెలఖారులోగా ఈ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ అందుబాటులోకి రానుంది. దీంతో 5 వేల వరకు సర్జరీలు చేసే అవకాశం ఉంది అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్లు తేలిందని..ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిరోధించొచ్చు అని అధ్యయనాల్లో తేలింది అని హరీశ్‌రావు చెప్పారు. క్యాన్సర్ సోకకుండా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలని ఈ సందర్భంగా మంత్రి శరీష్ రావు సూచించారు.