స్వయంకృషితో టాలీవుడ్ కింగ్ గా మారిన మెగాస్టార్

UPDATED 23rd SEPTEMBER 2018 SUNDAY 6:00 PM

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట తెలుగు సినీప్రపంచంలో ఓ ప్రభంజనం వీచింది. దానికి జనం నీరాజనం పట్టారు. ఆ ప్రభంజనం పేరే చిరంజీవి. అంతవరకు ఉన్న తెలుగు సినిమాల ఒరవడిని మార్చి, టాలీవుడ్ కు కొత్త ఒరవడిని కల్పించి ఒక న్యూ వేవ్‌ క్రియేట్ చేసిన సాహసి చిరంజీవి. మూడేళ్ల పిల్లాడి దగ్గర్నుంచి, తొంభై ఏళ్ల పండు ముదుసలి వరకు అందరికీ తెలిసిన చిరంజీవి నిన్న‌టితో త‌న 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. త‌న తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు సెప్టెంబ‌ర్ 22, 1978లో విడుద‌ల కాగా నిన్న‌టితో ఆ చిత్రం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఎన‌ర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్న చిరు త్వ‌ర‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చి టాలీవుడ్ ఖ్యాతిని మ‌రింత ఉన్న‌త స్థాయికి తీసుకెళ్ళ‌నున్నారు. చిరంజీవి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆయనలో ఉన్న స్పీడ్. అంతవరకు స్లో మూవ్ మెంట్స్ తో సాగిన తెలుగు సినిమాలు చిరంజీవి వచ్చాక స్పీడందుకున్నాయి. స్టెప్స్ లో స్పీడ్, డాన్సుల్లో స్పీడ్. అంతేకాదు చిరంజీవి వచ్చాక హీరో బాడీ లాంగ్వేజ్ మారింది. డాన్సుల్లో కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ శరీరాన్ని మెలికలు తిప్పుతూ యాక్ట్ చేయడం చిరంజీవితోనే మొదలైంది. సినిమాల్లోకి రాకముందు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన చిరంజీవి నటనలోనూ విభిన్నత్వాన్ని ప్రదర్శించాడు. చిరంజీవి నటనలో స్పీడ్ మాత్రమే కాదు, గంభీరత్వమూ ఉంది. నలుగురినీ నవ్వించే చిలిపితనమూ ఉంది. నటనలో నవరసాలే కాదు నలభై రసాలూ ప్రదర్శించిన ఘనుడు. చిరంజీవి అంటే ఆంజనేయుడు. అలాగే ఈ శివశంకర వరప్రసాద్ కూడా ఆంజనేయుడికి పరమ భక్తుడు. ఆంజనేయుడిలా సాహసి. సినిమాల్లోకి వచ్చేటప్పుడు చిరంజీవికి ఎవరి స‌పోర్ట్ లేదు. కేవ‌లం స్వయంకృషితో పైకి వచ్చి, టాలీవుడ్ లో కింగ్ గా మారి, మెగాస్టార్ కావడం ఈ మెగాధీరుడికే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ట్రెండ్ సెట్టర్. ఓ మేరునగ ధీరుడు, ఓ ఎవరెస్ట్. అందుకే మూవీ కెరీర్ లో తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చినా ఆడియన్స్ లో ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఖైదీ నంబర్ 150 మూవీనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమాకు వరం ఈ వరప్రసాదుడు. ప్రస్తుతం తన 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు చిరు. త‌న కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ని బ‌ద్దలు కొట్ట‌డం ఖాయం అని చిత్ర బృందం చెబుతుంది. రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇక చిరు సినీ జ‌ర్నీ 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని 41లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కి ప్రతీ ఒక్క‌రూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. చిరు త‌న కెరీర్‌లో మ‌రెన్నో మంచి చిత్రాలు చేయాల‌ని, వాటితో ప్రేక్ష‌కుల‌ని రంజింప చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us