రెడ్ బీ న్యూస్, 2 జనవరి 2022 : మార్కెట్లో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా.. ఒక్కసారైనా ఐఫోన్ ఉపయోగించాలనుకుంటాం. అంతే మరి..ఆ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అలానే ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో బ్లాక్‌బెర్రీ ఫోన్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. క్వర్టీ కీబోర్డుతో వెడల్పాటి డిస్ప్లే, డేటా సెక్యూరిటీ ఫీచర్లతో దశాబ్దకాలంపాటు మొబైల్ మార్కెట్లో ఈ ఫోన్ల హవా కొనసాగింది. కాలక్రమంలో టచ్ డిస్ప్లే ఫోన్లు రావడంతో బ్లాక్‌బెర్రీ ఫోన్లకు ఆదరణ తగ్గింది. తాజాగా బ్లాక్‌బెర్రీ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లు జనవరి 4 నుంచి పనిచేయవని కంపెనీ తెలిపింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ 7.1 నుంచి బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్‌తో పనిచేసే ఫోన్లకు సాఫ్ట్వేర్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నెలలోనే దీనికి సంబంధించి ప్రకటన చేసినప్పటికీ ‘యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్’ పేరుతో ఈ సేవలను మరో మూడు నెలల కొనసాగించింది. అయితే ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తున్న బ్లాక్‌బెర్రీ ఫోన్లు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ‘‘బ్లాక్‌బెర్రీ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లు ఉపయోగిస్తున్న యూజర్స్ జనవరి 4 తేదీ నుంచి ఫోన్‌కాల్స్, మెసేజింగ్, వైఫై కనెక్టివిటీతో పాటు ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి ఎలాంటి సేవలు ఉపయోగించలేరు’’ అని కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది. మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బ్లాక్‌బెర్రీ అమ్మకాలు ఐఫోన్ల రాకతో నెమ్మదించాయి. దీంతో 2013లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కు పోటీగా బ్లాక్‌బెర్రీ ఓఎస్‌ను పరిచయం చేసింది. అయితే ఈ ఓఎస్‌కు యూజర్స్ నుంచి ఆదరణ కరువైంది. ఈ నేపథ్యంలో 2015లో బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో టచ్ డిస్ప్లేతో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే యాపిల్, శాంసంగ్, షావోమి వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోయింది.