Vontimitta : ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. టీటీడీ ఛైర్మన్ సమీక్ష

UPDATED 1st APRIL 2022 FRIDAY 07:30 PM

Vontimitta Rama Kalyanam : ఏప్రిల్ 15వ తేదీన ఒంటిమిట్ట రామయ్య కల్యాణం జరుగనుంది. సీఎం జగన్ కల్యాణ వేడుకకు హాజరు కానున్నారు. ప్రభుత్వ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. అనంతరం కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వైవీ సుబ్బారెడ్డికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ నిర్మించిన ఆలయ కార్యాలయాల సముదాయం, అతిథి గృహం, యాత్రీకుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ చైర్మన్ అమర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డితో కలసి వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కల్యాణ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాముల వారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరు కావచ్చునని అంచనా వేసినట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈసారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి ఇబ్బందులు తలెత్తినా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా కల్యాణం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రూ 63 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us