KTR : కేసీఆర్‌ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్

UPDATED 18th FEBRUARY 2022 FRIDAY 07:20 PM

KTR : టీఆర్ఎస్ అధినాయకత్వం.. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సమరానికి సై అంటోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. నిప్పులు చెరుగుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ‘నమో’ అంటే నమ్మించి మోసం చేసేవాడు అంటూ నరేంద్ర మోదీ పేరుకి కొత్త భాష్యం చెప్పారు కేటీఆర్. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొందపెట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎందుకున్నావ్? అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం నాయకుడో అర్థం కాదు… కుంభమేళాకు రూ.300 కోట్లు ఇచ్చి, మేడారం జాతరకు రూ.2 కోట్లేనా? అని నిలదీశారు. “బీజేపీని బట్టలిప్పి కొడదాం… కేసీఆర్ ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం, కేసీఆర్ ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం” అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

”ఆంధ్రప్రదేశ్ విభజన దారుణం అని, బిడ్డను ఇచ్చి తల్లిని చంపారని గత ఎన్నికల్లో మోదీ అన్నారు. పార్లమెంటులో తలుపులు మూసి అన్యాయంగా విభజన చేశారని ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ అనడం దారుణం. బిల్లు ఓటింగ్ కు వస్తే దర్వాజా బంద్ చేసే ఓటింగ్ చేస్తారని తెలియనోడు మన ప్రధాని. సరిగ్గా ఇదే తేదీన తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. తెలంగాణ ఏర్పడ్డ రోజు ఎన్నో అడ్డమైన మాటలు అన్నారు. తెలివి ఉందా? నాయకత్వ సత్తా ఉందా? సీన్ ఉందా? అని అన్నారు. మీకు కరెంటే ఉండదు, చీకట్లో బతుకుతారు అని అప్పటి ముఖ్యమంత్రి అన్నారు. చాలామంది చర్చలు పెట్టి ఇష్టారీతిగా మాట్లాడారు. నేడు తెలంగాణ… దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణం అయ్యాయి. ప్రతి తెలంగాణ బిడ్డ గొప్పగా చెప్పుకునే అభివృద్ధి మనం చేసుకున్నాం” అని కేటీఆర్ అన్నారు.

”24 గంటలు కరెంట్ ఉచితంగా వస్తుందని కల కూడా కనలేదు. ఏడేళ్లలో నాయకుడి ముందు చూపు, ప్రజల ప్రేమతోనే ఇవన్నీ సాధించాం. అభివృద్ధి పథంలో వెళ్తున్న తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నావా మోదీ. ఇకపై తమ్ముళ్లలా ఆలోచన చేయండి. బీజేపీని బొంద పెట్టండి. నీతి ఆయోగ్ కింద ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథను కాపీకొట్టారు. జన్ ధన్ ఖాతాలకు డబ్బులు వస్తాయని మోదీ చెప్పాడా లేదా? మరి ఎవరికైనా 10 లక్షలు వచ్చాయా? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఏమైంది? చెప్పుడు కోట్లల్లో.. డెలివరీ పకోడీల్లో.. అన్నట్లు మోదీ తీరు ఉంది.

దేశంలో ఒకే తప్పు జరిగింది. నిన్ను నమ్ముడే తప్పైంది. జీవితాల్ని మార్చమని ప్రధానిని చేస్తే జీవిత భీమా లేకుండా చేస్తున్నాడు. ఏది అడిగినా సమాధానం చెప్పడు. మూడేళ్లలో ఎంపీగా బండి సంజయ్ వేములవాడ రాజన్న కోసం మూడు పైసలైనా తెచ్చాడా? మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదు, నిధులూ ఇవ్వరు. బీజేపీ అంటే బక్వాస్ బడా పార్టీ. హిందుత్వ పార్టీ అయితే బండి సంజయ్ వేములవాడకు వెయ్యి కోట్ల నిధులు తీసుకురా. బీజేపీ వివక్షను వారి పద్ధతిని బయటపెట్టి ప్రజల ముందు నిలబెట్టాలి. కేసీఆర్ ను ఒక్క మాట అన్నా ఊరుకునేదే లేదు. బీజేపీ వాళ్లు హద్దులు దాటితే చుక్కలు చూపిద్దాం. మా నాయకులను కానీ, పార్టీని కానీ ఎవరైనా ఒక్క మాట అంటే ఫిరంగులై గర్జిద్దాం” అని కేటీఆర్ అన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us