శ్రీప్రకాష్ లో ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం

UPDATED 21st APRIL 2018 SATURDAY 8:00 PM 

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలులో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ధరిత్రి దినోత్సవ ర్యాలీని మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్త జీవకోటికి జన్మనిచ్చి, పలు పంటలతో సమస్త ప్రాణులను పోషిస్తున్న వేల కోట్ల చదరపు కిలోమీటర్ల ఉపరితల వైశాల్యంతో విస్తరించిన భూమాత ఆరడుగులు మించని మానవ వికృత చేష్టలతో వణికిపోతోందని అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు. భూమి స్వరూప స్వభావాలను ఇష్టానుసారం మార్చేస్తూ, కాలుష్యానికి కారణమవుతూ అణువణువునూ గాయాల పాల్జేస్తున్న మనం ఇప్పటికైనా విధ్వంసకర చర్యలను విడనాడి తప్పిదాల నుంచి మేల్కొనకపోతే భవిత అంధకారంగా మారే ప్రమాద పరిస్థితులు పొంచి చూస్తున్నాయన్నారు. అమృత ఫలాలను, సుజలాలను అందించే నేలతల్లికి మనమంతా క్షమాపణలు చెప్పి దిద్దుబాటు చర్యలకు ఇప్పటికైనా నడుం బిగించాలని పేర్కొన్నారు. మనతోపాటు భావితరాలకు ఎటువంటి ఉపద్రవాలు ముంచెత్తకుండా అవని తల్లిని అంతా కాపాడుకోవాలని ఆయన తెలిపారు. వాతావరణాన్ని పరిరక్షించాల్సి బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, కాలుష్యాన్ని అధిగమించేందుకు మొక్కలను నాటాలని సూచించారు. వృక్ష శాస్త్ర పరిశోధకుడు ఎ.ఆర్.కె. శాస్త్రి మాట్లాడుతూ భూమాతను పవిత్రంగా చూస్తేనే అది మనల్ని అన్నివిధాలా రక్షిస్తుందని, మనం ఉపయోగించిన పాలిథిన్‌ సంచులు, ప్లాస్టిక్‌ పదార్ధాలు భూమిలో ఉండిపోయి విషతుల్యాలుగా మారి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా చేసి భూగర్భం విచ్ఛిత్తికి గురవుతోందని అన్నారు. వర్షం నీటిని చెరువులు, కుంటల్లో నిల్వచేసుకోకుండా భూగర్భ జలాలను ఇష్టానుసారం వాడేస్తుండటంతో అవికాస్తా నిర్వీర్యంగా మారుతున్నాయని, ఇంకుడుగుంతలతో వర్షం నీటిని భూమిలోకి నింపేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా చెట్లను సంరక్షిస్తే భూమి చల్లగా, పవిత్రంగా ఉంటుందని, కంప్యూటర్లు, పలు రకాల బ్యాటరీ వ్యర్థాలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు మట్టిని విషపూరితం చేస్తున్నాయని, వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు వాతావరణ కాలుష్యంపై రూపొందించి ప్రదర్శించిన కాలుష్య రహిత కళాకృతులు, కాగితంతో తయారుచేసిన కళాకృతులను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, ఏకోక్లబ్ ఇంఛార్జ్ ఉషా చైతన్య, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.ఎస్. మూర్తి, ఎం. శ్రీదేవి, లైజన్ ఆఫీసర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us