Ram Navami 2022: శ్రీ సీతారాముల కల్యాణానికి ఒంటిమిట్ట దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు

UPDATED 9th APRIL 2022 SATURDAY 04:50 PM

Ram Navami 2022: ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కల్యాణం ఏర్పాట్లపై శనివారం టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని సమావేశపు హాలులో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీ అన్బురాజన్ తో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ కల్యాణం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో రెండోసారి సమావేశం నిర్వహించినట్టు చెప్పారు.

కల్యాణవేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతిరోజూ అధికారుల కమిటీ సమావేశమై ఏర్పాట్లపై చర్చిస్తారని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఏర్పాట్లు మొత్తం పూర్తవుతాయన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, విద్యుత్ అలంకరణలు, బ్యారీకేడ్లు, ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందించనున్నట్లు స్పష్టం చేశారు. కల్యాణం రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవారు ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు చేరుకుంటారని వివరించారు. అక్కడ భక్తులను ఆకట్టుకునేలా అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ సంకీర్తనలు, త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ విఠ‌ల్‌దాస్ మ‌హ‌రాజ్ బృందం నామ‌ సంకీర్త‌నం నిర్వహిస్తామన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రత నడుమ కల్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. ఏప్రిల్ 15న జరిగే రాములవారి కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.

కల్యాణవేదిక ముందు ఏర్పాటుచేసిన ప్రతి గ్యాలరీకి ఇంఛార్జిగా ఒక ఎంపీడీవోను నియమిస్తామన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us