గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి

UPDATED 27th SEPTEMBER 2019 FRIDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాధ్ అన్నారు. ఐసిడిఎస్ పివో పి. సావిత్రి అధ్యక్షతన పెద్దాపురం పట్టణంలో పాశీల వారి వీధిలో గల కొప్పుల వెలమ కమ్యూనిటీ భవనంలో పౌష్టికాహార మాసోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గీతా విశ్వనాధ్ పాల్గొని మాట్లాడుతూ భారత ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తుందని, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని పొంది ఆరోగ్యవంతులైన బిడ్డకు జన్మనివ్వాలని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం 1873 మంది గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతున్నారని తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రాముఖ్యత, పుట్టబోయే శిశువు మంచి ఆరోగ్యంగా జన్మించడానికి అవసరమైన సూచనలను ఇచ్చి వారిని చైతన్యపరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలను మహిళలకు పూర్తిస్థాయిలో అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రంగరాయ మెడికల్ కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన దాతల సహకారం రూ. 25 కోట్లు, ప్రభుత్వ నిధులు మరో రూ. 25 కోట్ల వ్యయంతో త్వరలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా, శిశు విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ఆమె అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తోడు దాతల సహకారం అందిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగానే లలితా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతల ఆర్ధిక సహాయంతో అంగన్వాడీ కేంద్రాలకు 80 గ్యాస్ స్టవ్ లను అందించడం అభినందనీయమని అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు సీడీపీవో కార్యాలయాలు దాదాపు పూర్తయ్యాయని, అలాగే నియోజకవర్గంలో నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించి ప్రారంభించడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల భవనాలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. సమాజంలో గర్భిణీ స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉందని, దీనికి అనువుగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయని, చాలా వరకూ మహిళలలో
చైతన్యం కలిగి మాతా, శిశు మరణాలు తగ్గాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ భారతదేశంలో మధ్య తరగతి కుటుంబీకులు అనేక మంది ఉన్నారని, వీరికి ప్రభుత్వపరంగా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి మంచిని చేకూర్చేవిధంగా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం పౌష్టికాహార మాసోత్సవాల ప్రతిజ్ఞను సీడీపీవో సావిత్రి అందరిచేత చేయించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల సభ్యులకు గ్యాస్ స్టవ్ లు, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. పౌష్టికాహార మాసోత్సవాలు సందర్భంగా వ్యక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు దొరబాబు చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, నెక్కంటి సాయిప్రసాద్, మట్టే శ్రీనివాస్, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీడీపీవో పద్మావతి, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us