UPDATED 27th MARCH 2022 SUNDAY 08:30 AM
Bus Rollover At Bhakarapeta Ghat Road : చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ప్రమాదంలో 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. కొందరిని రుయా, మరికొందరిని స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భాకరాపేట ఘాట్ రోడ్డులో 2022, మార్చి 26వ తేదీ శనివారం రాత్రి పెళ్లి బస్సు బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 అడుగుల లోయలో ప్రైవేటు బస్సు పడిపోయింది. ధర్మవరం నుంచి తిరుపతిలో నిశ్చితార్థానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు సమాచారం. భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెళ్లింటే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందన్నారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు, లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.