Bandi Srinivas : ఏ పద్ధతిలో పీఆర్సీని ప్రభుత్వం ఫిక్స్ చేసింది..?

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 06:20 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ వార్ సాగుతోంది. ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇవాళ పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ పద్ధతిన పీఆర్సీ ఫిక్స్ చేసిందని ప్రశ్నించారు.

ఇన్నాళ్లూ రకరకాల కమిటీలన్నారు.. ఇప్పుడు ఎనామలీస్ కమిటీ అంటున్నారని పేర్కొన్నారు. ఎనామలీస్ కమిటీ అంటే ఏంటో.. ఆయనెక్కడున్నారో వెతుక్కోవాలా..? అని అన్నారు. సీఎస్ సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల్లో చేసి వచ్చారు కాబట్టి.. ఏపీలో అవలంభించే విధానం ఆయనకు తెలియదనుకుంటానని పేర్కొన్నారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణుకు పిచ్చి పట్టిందో.. తమకు పిచ్చి పట్టిందో అర్థం కావడం లేదన్నారు. వందేళ్ల క్రితం ఎప్పుడో ఆప్షన్ తీసుకునే విధానం ఉందని శశిభూషణ్ ఎలా చెబుతారని పేర్కొన్నారు.

తాము బ్రిటీష్ కాలంలో పని చేసిన వాళ్లమా..? అని అన్నారు. ఆప్షన్ విషయంలో గత పీఆర్సీలు అవలంభించిన విధానం శశిభూషణ్ పరిశీలించాలని కోరారు. వైద్యారోగ్య శాఖలో బదిలీల జీవోను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో ఉండగా బదిలీలు ఏంటని ప్రశ్నించారు. బదిలీల జీవోను నిలుపుదల చేయకుంటే అత్యవసర సేవలనూ నిలిపేస్తామని హెచ్చరించారు.

అనంతరం పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం అని సీఎస్ సమీర్ శర్మ అనడం చాలా బాధాకరమన్నారు. తమ జీతాలను కూడా అప్పుగానే భావిస్తారా..? అని అడిగారు. పీఆర్సీకి డీఏలకు ఏమైనా సంబంధం ఉందా..? ప్రశ్నించారు. సీనియర్ అసిస్టెంట్ హోదాలో వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగికి కొత్త పీఆర్సీ వల్ల రూ. 2900 నుంచి రూ. 500 మేర తగ్గిందన్నారు.

డీఏలు కలిపిన తర్వాత కూడా సీనియర్ అసిస్టెంట్ హోదాలో వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగికి కొత్త పీఆర్సీ వల్ల రూ. 1700 నుంచి రూ. 1400 మేర తగ్గిందని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్ వాస్తవాలు గుర్తించాలన్నారు. సీఎం చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారో గమనించాలని కోరారు.

పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సీఎస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై కమిటీ సభ్యులు భేటీలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపైనా స్టీరింగ్ కమిటీ చర్చించింది. ఇదిలావుంటే చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు సజ్జల, సీఎస్ ఆఫర్ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us