UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 07:00 AM
Medaram Mahajatara : మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య.. భక్తులను అనుగ్రహించేందుకు వన దేవతలు జనంలోకి వచ్చారు. గిరిజన పూజారుల ప్రత్యేక పూజల నడుమ.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు.. పసుపు, కుంకుమ రూపంలో.. అమ్మవారిని భారీ బందోబస్తు నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు. ముందుగా.. గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్టించి.. ఆ తర్వాత.. సారలమ్మను గద్దెలపై ఆసీనురాలిని చేశారు. ఇక.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకొచ్చిన పూజారులు.. గద్దెలపై ప్రతిష్టించారు.
వనదేవతలకు మంత్రులు, జిల్లా అధికారులు.. అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. దీంతో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకునే కీలక ఘట్టాన్ని వీక్షించేందకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతరలో ప్రధాన దేవతయిన సమ్మక్క.. ఇవాళ గద్దెపైకి చేరనుంది. చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. రేపు అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. ఎల్లుండి సాయంత్రం వారిని యథాస్థానానికి తీసుకెళ్తారు.
మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వేలాది వాహనాల్లో భక్త జనం మేడారంకు తరలొస్తున్నారు. మేడారం కుగ్రామం పూర్తిగా జానారణ్యంగా మారింది. జంపన్నవాగులో భక్తులు స్నానమాచరిస్తున్నారు. చుట్టూ పది కిలోమీటర్ల మేర గుడారాలు వేసుకొని వన దేవతల ఆగమనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. నాలుగు రోజుల జాతరకు 1కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. జాతర నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మేడారం జాతరకు 21లక్షల మంది భక్తులను తరలించడమే లక్ష్యంగా టీఎస్ ఆర్టీసీ పరుగులు పెడుతోంది. 3845 RTC బస్సులతో భక్తులను మేడారం జాతారకు తరలించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో భక్తుల పికపింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే మేడారం ప్రసాదం అందించనుంది. హెలికాప్టర్ ద్వారా మేడారంకు VIP భక్తులు చేరుకుంటున్నారు. హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీస్ లు నడపనున్నారు.